టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి తనయుడు చింతకాయల విజయ్ ఇంట్లో కొద్దిరోజుల క్రితం ఏపీ సిఐడి పోలీసులు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లిన సిఐడి పోలీసులు ఆయన పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. విజయ్ ఎక్కడికి వెళ్లారు అంటూ పిల్లలను సిఐడి అధికారులు పదేపదే ప్రశ్నించి మానసికంగా వేధించారని పలువురు టిడిపి నేతలపాటు అయ్యన్నపాత్రుడు, విజయ్ ఆరోపించారు.
చిన్న పిల్లలను ఆ రకంగా విచారణ చేయడం ఏమిటని వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ…ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సిఐడి అధికారులు తమ పిల్లలను మానసికంగా వేధించారని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా సిఐడి పోలీసుల నుంచి తమకు, తమ కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సిఐడి అదనపు డీజీతోపాటు ఏపీ డీజీపీ, సిఐ పెద్దిరాజులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను రెండు వారాలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. విజయ్ కుటుంబాన్ని నోటీసులు పేరుతో మళ్లీ వేధించకుండా సిఐడి పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా సువర్ణ తరఫు న్యాయవాది…న్యాయమూర్తులకు విన్నవించారు.
అయితే, ఈ తరహా ఘటనలు మరోసారి జరగని ప్రభుత్వం తరఫు న్యాయవాది హామీ ఇచ్చారు. ఏదేమైనా ఈ ఘటనపై ఏపీ డీజీపీ, ఏపీ సిఐడీ డిజిల వివరణ ఏ విధంగా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తనపై ఏపీ సిఐడి పెట్టిన కేసులు కొట్టి వేయాలంటూ చింతకాయల విజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టింది కొట్టి వేసిన సంగతి తెలిసిందే.