కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. అదే సమయంలో తెలంగాణ ను విస్మరించడం విమర్శలకు దారితీస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ స్థానాలు, బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఎంపీలపై విమర్శలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తేనే కేంద్రంలో పోరాడి నిధులు సాధించగలం అని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పదే పదే కోరినా ఒక్క స్థానం కూడా దక్కలేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కింది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కాయి. మోడీ ప్రభుత్వం నిలబడడానికి టీడీపీ, జేడీ యూ పార్టీల మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు పెద్దపీట లభించింది. ఎంపీల బలం లేకపోవడమే తెలంగాణకు శాపంగా మారిందన్న వాదన వినిపిస్తుంది.