గత ఏడాది ఇదే సమయానికి ‘యానిమల్’ ప్రభంజనం చూస్తున్నాం. ఆ సినిమా మీద ముందు నుంచే మంచి అంచనాలున్నాయి కానీ.. మరీ ఆ స్థాయిలో హవా సాగిస్తుందని.. ఏకంగా 900 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఈవెంట్ ఫిలిం కాకపోయినా.. రణబీర్‌కు పెద్దగా మాస్ ఇమేజ్ లేకపోయి.. సందీప్ రెడ్డి వంగ అనుభవం కేవలం రెండు సినిమాలే అయినా.. ‘యానిమల్’ ఆ స్థాయిలో వసూళ్ల మోత మోగించడం అనూహ్యం.
ఈ సినిమా రిలీజైనపుడే సీక్వెల్ కన్ఫమ్ అయిపోయింది. యానిమల్ పార్క్ పేరుతో పార్ట్-2ను ఇంకా వైల్డ్‌గా తీయబోతున్నట్లు సందీప్ రెడ్డి సంకేతాలు ఇచ్చాడు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం సందీప్ దృష్టి ప్రభాస్‌తో తీయబోతున్న ‘స్పిరిట్’ మీద ఉంది. యానిమల్ పార్క్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడమే కాదు.. ఈ ఫ్రాంఛైజీలో మరో సినిమా కూడా ఉంటుందని హీరో రణబీర్ కపూర్ వెల్లడించడం విశేషం.
ఓ ఇంటర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ.. యానిమల్ పార్క్ మూవీని 2027లో మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతే కాక యానిమల్ ఫ్రాంఛైజీలో మరో సినిమా కూడా తీయాలనే ఉద్దేశం సందీప్ రెడ్డికి ఉందని చెప్పాడు. తాను చూసిన వాళ్లలో సందీప్ రెడ్డి అత్యంత ఒరిజినల్ డైరెక్టర్ అని ఈ సందర్భంగా రణబీర్ కితాబు ఇవ్వడం విశేషం. ‘యానిమల్’ మూవీ బోల్డ్‌గా, వైల్డ్‌గా తీయడం గురించి గతంలో స్పందిస్తూ.. ‘యానిమల్ పార్క్’ ఇంకా బోల్డ్ అండ్ వైల్డ్‌గా ఉంటుందని చెప్పడం గమనార్హం.
‘యానిమల్’కే జనాలు వెర్రెత్తిపోయిన నేపథ్యంలో ‘యానిమల్ పార్క్’కు ఇంకెంత షాకవుతారో చూడాలి. ఈ ఫ్రాంఛైజీలో మరో సినిమా అంటే సందీప్ ఇంకెంత వైల్డ్ మూవీ చూపిస్తాడో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రణబీర్ ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నాడు. అందులో రణబీర్ రాముడు కాగా.. సాయిపల్లవి సీతగా నటిస్తోంది. యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. నితీశ్ తివారి ఈ చిత్రాన్ని దర్శకుడు.