కొంతకాలంగా సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతోన్న సంగతి తెలిసిందే. మనదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని, ఇలాగే ఉంటే చైనా, జపాన్ మాదిరి జనాభా సమస్య భారత్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెబుతున్నారు. గతంలో జనాభా నియంత్రణ అని నిబంధనలు విధించిన చైనా..ఇప్పుడు పిల్లల్ని కంటే తాయిలాలు ఇస్తోంది. ఆ పరిస్థితి భారత్ కు రాకూడదన్న ముందు చూపుతో చంద్రబాబు పాపులేషన్ మేనేజ్మెంట్ పై చర్చ జరగాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధన తీసేసే యోచనలో ఉన్నామని చంద్రబాబు పలు వేదికల్లో చెప్పారు. చెప్పడమే కాదు పాపులేషన్ మేనేజ్మెంట్ దిశగా చంద్రబాబు తన రాష్ట్రం నుంచే తొలి అడుగు వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు-2024ను అసెంబ్లీలో నిన్న సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తాజాగా జరిగిన సవరణతో ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదు అనే నిబంధన అడ్డు కాబోదు. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్నా సరే ఇకపై స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులు అని చట్ట సవరణ చేశారు.
యువత ఏ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో శరవేగంగా జరుగుతుంది అని చైనా నిరూపించింది. నియంత పోకడలతో ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం జంటకు ఒక్కరే బిడ్డ అనే కఠిన ఆంక్షలు విధించిన చైనా…ఇప్పుడు జనాభా కోసం నానా తిప్పలు పడుతోంది. పిల్లలను కంటే నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం అని, ఒక్కో బిడ్డకు 23 లక్షల రూపాయల బేబీ లోన్ ఇస్తామని ప్రజలకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. అటువంటి స్థితి భారత్ కు ముఖ్యంగా దక్షిణాది, ఏపీలకు రాకూడదని చంద్రబాబు తన విజన్ తో ఈ నిర్ణయం తీసుకున్నారు.