ఏపీ సీఎం జగన్ పాలనలో కోట్ల విలువైన రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులకు సంబంధించిన కాంట్రాక్టు కోసం టెండర్ వేసేందుకు ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాకపోవడం కొద్ది రోజుల క్రితం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అప్పుల కుప్పలా మారిన ఏపీ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న కథనాలు, జగన్ అప్పు చేసి పప్పుకూడుపై కేంద్రం సైతం ఆరా తీయడం వంటి కారణాలతో కాంట్రాక్టర్లు టెండర్ ఊసే ఎత్తడం లేదని టాక్ వస్తోంది.
ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు గత రెండేళ్లుగా చేసిన పనులకు నయాపైసా బిల్లులు రాకపోవడం వంటి కారణాలతో కుదేలైపోయారట. గత ప్రభుత్వంలో హాట్ కేక్ లా మారే టెండర్ ప్రక్రియ…ఇపుడు సద్ది కేక్ లా మారిందని కాంట్రాక్టర్లు అంటున్నారు. టెండరు వేయండి మహాప్రభో అని పదే పదే గడువు పొడిగిస్తున్నా కాంట్రాక్టర్లెవరూ టెండర్ వేసేందుకు సాహసించడం లేదు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పిలిచే టెండర్లలో పాల్గొనకూడదని జగన్ ను కాంట్రాక్టర్లు బ్యాన్ చేశారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇలా తమ నిరసన తెలిపితే అయినా చేసిన పనులకు బిల్లులు వస్తాయేమోనని వారు అనధికారికంగా ఏపీ ప్రభుత్వంపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా హ్యాపీనెస్ట్ రివర్స్ టెండరింగ్‌కు గడువు ముగిసినా ఒక్కటంటే ఒక్క టెండర్ కూడా రాలేదు. దీంతో హ్యాపీనెస్ట్ భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది.
హ్యాపీనెస్ట్‌పై జగన్ ముందునుంచి ఆసక్తిగా లేరు. వాస్తవానికి 2021 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి లబ్దిదారులకు ఫ్లాట్లను అందించాలి. కానీ, అమరావతిపై కక్షగట్టిన జగన్…మూడు రాజధానులంటూ రెండున్నరేళ్లుగా కాలయాపన చేసి హ్యాపీనెస్ట్ ను నిర్లక్ష్యం చేశారు. అయితే, డిసెంబరు దగ్గర పడుతుండడంతో జగన్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది. కానీ, అమరావతి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో రూ. 640 కోట్ల విలువైన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్ వేసేందుకు ఏ కాంట్రాక్టర్ సాహసించలేదని తెలుస్తోంది.