జగన్ అక్రమాస్తుల కేసులో పలువురు ఐఏఎస్ ల పేర్లున్న సంగతి తెలిసిందే. ఆనాడు దివంగత సీఎం వైఎస్ హయాంలో జగన్, వైఎస్ మాట కాదనలేకపోయిన ఐఏఎస్ లు కొందరు ఇపుడు కోర్టుల చుట్టు తిరుగాల్సి వస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. తాజాగా నేడు ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు…శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సంచలనం రేపింది.
జగన్ అక్రమాస్తుల కేసులో నేడు సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎస్ శ్రీలక్ష్మికి కోర్టు ఎన్ బీడబ్ల్యూ జారీ చేసింది. దాల్మియా కేసు విచారణకు రానందున శ్రీలక్ష్మీకి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం గమనార్హం. మరోవైపు, పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు రిటైర్డ్ ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి హాజరైయ్యారు. వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేసింది.
ఇక, వాన్‌పిక్ కేసులో మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి హాజరుకాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల లాయర్లు రాకుంటే ఉత్తర్వులు ఇస్తామని కోర్ుట హెచ్చరిచింది. మరోవైపు, జగన్, విజయసాయి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది. ఈ క్రమంలోనే వాన్‌పిక్, దాల్మియా కేసుల విచారణను ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది. అదే విధంగా జగతి పబ్లికేషన్స్, పెన్నా సిమెంట్స్ కేసుల విచారణ కూడా ఈ నెల 30కి వాయిదా పడింది.