మరికొద్దిరోజుల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటన పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. 3 రోజుల క్రితం నందిగ్రామ్ లో నామినేషన్ వేసి గుడికి వెళ్లి వస్తుండగా తనపై నలుగురు దాడి చేశారని దీదీ స్వయంగా వెల్లడించడం కలకలం రేపింది. అందులోనూ నందిగ్రామ్ లో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి …దీదీపై పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి ఘటన చర్చనీయాంశమైంది.
అయితే, దీదీ సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం…ఆ ఘటన నిజనిర్ధారణ కోసం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. దీంతో, ఆ పరిశీలకుల బృందం నందిగ్రామ్ వెళ్లి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో వారు సంచలన విషయాలు వెల్లడించారు.
మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని ఎన్నికల సంఘం పరిశీలకులు నివేదికలో స్పష్టం చేశారు. దాడి ఘటనకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, దాడి జరిగిందని చెబుతోన్న సమయంలో మమత వెంట పోలీసులు కూడా ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. అంతకుముందు బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ్ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. ప్రత్యేక పరిశీలకులను నియమించింది.
కారు డోర్‌ను తెరిచి ఉంచి.. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. కారు డోర్ ఓ పిల్లర్కి తగిలి, బలంగా మూసుకుందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు తెలుస్తోంది. కారు డోర్ బలంగా మూసుకోవడం వల్లే మమత కాలికి గాయాలయ్యాయని వారు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, తనపై దాడి చేశారని దీదీ చెబుతున్నారు. మరి, ఈ నివేదికపై దీదీ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
ఏది ఏమైనా….ఈ ఘటనతో దీదీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని, సింపతీతో ఓట్లు కొట్టేదామనుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ డ్రామా ఘటనకు పీకేనే దర్శకుడని, ఏపీలో జగన్ పై కోడికత్తి దాడి తరహాలో బెంగాల్ లో దీదీపై కూడా దాడి డ్రామాను పీకే ఆడించారని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తో దీదీకి మైలేజీ రాకపోగా…డ్యామేజీ ఎక్కువగా జరిగిందని సెటైర్లు వేస్తున్నారు.