ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా…అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అర్హత ఉన్న వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని మొత్తుకుంటున్నాయి. అయితే, వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలు, అపోహల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగడం లేదు.
ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వ్యాక్సిన్ వేయించుకోనివారికి రేషన్, పెన్షన్ నిలిపివేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది..
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ కట్ అంటూ వస్తున్న వార్తలను వైద్యారోగ్య శాఖ ఖండించింది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు అవాస్తవమని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫు నుంచి అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ప్రజలు అసత్య ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని అన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.