టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏం చేస్తానో అనేది ఆయన చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి అయినా.. సామాన్యుడిగానే జీవిస్తానని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కటి కూడా జరగడానికి వీల్లేకుండా నడుచుకుంటానని తెలిపారు. టీడీపీ తరఫున ఎన్నికైన అభ్యర్థులు కూడా అలానే వ్యవహరించాలనిచంద్రబాబు సూచించారు.
ముఖ్యంగా సీఎం వస్తున్నారంటే.. ట్రాఫిక్‌ను గంట కొద్దీ ఆపేశారని.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నానా తిప్పలు పడ్డారని చంద్రబాబు చెప్పారు. ఆ కష్టాలను తనకు అనేక మంది విన్నవించుకున్నారని చెప్పా రు. ఈ నేపథ్యంలో తాను ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేని వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గ్రీన్ ఛానెల్ అనేది ఉండబోదన్నారు. అదేవిధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకా రం చేసేవారికి కూడా ఇదే వర్తిస్తుందన్నారు.
అదేవిధంగా తను ప్రయాణించే మార్గాల్లో ఎక్కడా చిన్న మొక్కను కూడా పీకేందుకు వీల్లేదని చంద్రబాబు చెప్పారు. గత పాలకుడు.. ఎక్కడికి వెళ్లినా.. చెట్లను శత్రువులుగా చూశారని.. చెట్లు ఏం పాపం చేశాయో ఎవరికైనా అర్థమైందా? అని ప్రశ్నించారు. కుదిరితే చెట్లు పెంచాలి. లేకపోతే మానుకోవాలి. కానీ, ఇలా చెట్లు నరకడం ఏంటి? ఎక్కడైనా ఉందా? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన పాలనా కాలంలో నీరు-చెట్లు పథకం కింద చెట్లు పెంచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రేపు మంత్రులు అయ్యే వారు.. వివిధ పదవులు తీసుకునేవారు కూడా.. ప్రజలకు వినయంగా సేవలు చేయాలని చంద్రబాబు సూచించారు. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. గతంలో మాదిరిగా మంత్రులు వచ్చినా.. సలహదారులు వచ్చినా ట్రాఫిక్ ఆపడం, రోడ్లు మూసేయడం, చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టుకోవడం, షాపులు బంద్ చేయడం వంటివి ఉండడానికి వీల్లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.