జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా మీడియా జనాలు మండిపోతున్నారు. జర్నలిస్టులకు రాష్ట్రప్రభుత్వాలు అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. జర్నలిస్టులు పనిచేసే సంస్ధల యాజమాన్యాలు గుర్తింపుకార్డులను ఇచ్చినా ఇవ్వకపోయినా అక్రిడేషన్ కార్డులన్నవి జర్నలిస్టులకు చాలా ఇంపార్టెంట్. అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం ప్రతి ఏడాది కానీ రెండేళ్ళకు ఒకసారి కానీ జారీ చేస్తుంటాయి.
జర్నలిస్టులకు కార్డులను జారీ చేయటానికి రాష్ట్రస్ధాయి నుండి జిల్లాస్ధాయి వరకు ప్రతి ప్రభుత్వంలో అక్రిడిటేషన్ కమిటిలను ఏర్పాటు చేసినట్లే ఏపిలో కూడా ఉండేవి. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటిలో ఒక్కరంటే ఒక్క రిపోర్టర్ కు కూడా చోటు కల్పించలేదు. అక్రిడేషన్లు అందుకునే వారిలో ప్రధానంగా రిపోర్టర్లే ఎక్కువగా ఉంటారు. కాబట్టి సదర కమిటిల్లో రిపోర్టర్లే కీలకంగా ఉంటారు. అలాంటి కమిటిలో ఇపుడు ఒక్క రిపోర్టర్ కు కూడా స్ధానం దక్కలేదు.
విచిత్రమేమిటంటే అసలు మీడియా ఫీల్డుతో సంబంధం లేని శాఖల ఉన్నతాధికారులందరికీ కమిటిలో చోటు కల్పించింది ప్రభుత్వం. ప్రభుత్వం తాజాగా నియమించిన రాష్ట్రస్ధాయి కమిటిలో పౌర సంబంధాల శాఖ కమీషనర్ ఛైర్మన్ గా ఉంటారు. కమిటిలో వైద్య, ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కార్మికశాఖ కమీషనర్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, రైల్వే పీఆర్వో, ఆర్టీసీ ఎండి, సమాచార శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యుల్లో వైద్య, ఆరోగ్య శాఖ, కార్మికశాఖ, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ కు ఏమి సంబంధమో ప్రభుత్వానికే తెలియాలి. అలాగే రైల్వే పీఆర్వో, ఆర్టీసీ ఎండిలను ఎందుకు నియమించిందో కూడా తెలీటం లేదు.
జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డల కమిటిలో ఒక్క జర్నలిస్టు కూడా లేకపోవటమే విచిత్రంగా ఉంది. జర్నలిస్టులు లేకుండా పైగా మీడియాతో ఎటువంటి సంబంధం లేని శాఖల అధికారులతో కమిటిని వేయటం బహుశా ఇదే మొదటిసారి. మరి కమిటిలోని సభ్యులను నియమించేటపుడు ఓ మాట జగన్ కు చెప్పారో లేదో కూడా తెలీటం లేదు. ఇటువంటి అసంబద్దమైన కమిటిని నియమించటంలో ఉన్నతాధికారులే కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. మరిపుడైనా జగన్ జోక్యం చేసుకుని కమిటిని రద్దు చేసి మళ్ళీ కొత్తది వేస్తే ప్రభుత్వానికే గౌరవంగా ఉంటుంది.