తన కాళ్ల కిందకు నీళ్లు వచ్చేసరికి వ్యాక్సిన్ విషయంలో కేంద్రం చూపుతున్న సవతి తల్లి ప్రేమ ఎలాంటిదో ఏపీ సీఎం జగన్ కు తెలిసి వచ్చిందని అంటున్నారు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
కొన్ని రోజుల కిందట జార్ఖండ్ సీఎం, జగన్ కన్నా వయసులో చిన్నవాడైన హేమంత్ సొరేన్.. వ్యాక్సిన్ విషయంలోను, కరోనా కట్టడి విషయంలోనూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చూపుతున్న సవతి తల్లి ప్రేమపై నిప్పులు చెరిగారు. మా మనసులో మాట కూడా వినండి మోడీజీ! అంటూ.. ట్వీట్ చేశారు.
అయితే.. దీనికి జగన్ కౌంటర్ ఇచ్చారు. `ఈ సమయంలో అందరం.. మోడీని అనుసరించాలి. ఆయనను బలపరచాలి. లేక పోతే.. ప్రపంచ దేశాల ముందు మనం చులకనైపోతాం“ అని సుద్దులు చెప్పారు. దీంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
అయితే.. ఖచ్చితంగా రెండు వారాలు తిరిగే సరికి.. ఇప్పుడు జగన్ యూటర్న్ తీసుకుని.. అందరూ కలిసి కట్టుగా మోడీపై యుద్ధానికి దిగాలి.. రండి! అంటూ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
అంతేకాదు.. వ్యాక్సిన్ విషయంలోను, కరోనా కట్టడికి సంబంధించి నిధుల కేటాయింపులోనూ.. మోడీ సర్కారు కొన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని జగన్ కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. వాస్తవానికి ఇది నిజమే అయినప్పటికీ.. రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్న జగన్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ నమ్మే పరిస్థితిలో లేక పోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తృతీయ కూటమిపై జగన్ను కలిసి రావాలంటూ.. లేఖ రాయగా.. ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు.
మరోవైపు.. బెంగాల్ ప్రభుత్వానికి-మోడీకి మధ్య ఉప్పు-నిప్పుగా పరిస్థితి మారిపోయినా.. జగన్ ఈ విషయంలో చోద్యం చూస్తున్నారు. అదేసమయంలో.. జార్ఖండ్ సీఎం మోడీపై విమర్శలు గుప్పిస్తే.. తప్పని వేలెత్తి చూపించారు. ఇలాంటి జగన్ ఇప్పుడు రంగులు మార్చుకుని.. మోడీపై యుద్ధానికి సిద్ధమయ్యాను.. నన్ను బలపరచండి.. అంటే ఎవరు మాత్రం నమ్ముతారని అంటున్నారు నెటిజన్లు.
తన అవసరం.. తన అవకాశం చూసుకుని.. ఇప్పుడు మోడీపై యుద్ధం చేస్తానని అంటున్న జగన్ను విశ్వసించే పరిస్థితి లేదని.. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తేల్చి చెప్పినట్టేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.