టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ ఈ రోజు జరిగి చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన టీడీపీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసు సంబంధిత పత్రాలను సోమవారం లోపు సుప్రీం కోర్టులో సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే, మను సింఘ్వీలు చంద్రబాబు తరఫఉ వాదించారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని, రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని సాల్వే వాదనలు వినిపించారు. ఆధారం చూపకుండా చంద్రబాబును అరెస్టు చేశారని మను సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. ఆ కేసు దర్యాప్తుపై జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీయగా…చంద్రబాబును చాలాకాలం జైల్లో పెట్టేలా కక్ష సాధింపు కనిపిస్తోందని లూథ్రా వెల్లడంచారు.
మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో జగన్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. అంగళ్లు కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఈ కేసులో దేవినేని ఉమ సహా పలువురు టీడీపీ నేతలుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా..దానిని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఇక, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు మరో 2 వారాల పాటు పొడిగించింది. నారాయణతో పాటు బాబి, నారాయణ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 2 వారాల పాటు ముందస్తు బెయిల్ ను పొడిగించింది.