టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు చంద్రబాబు తరఫు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. చంద్రబాబు గత 16 రోజుల నుండి కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ ను అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోరారు. అయితే, రేపు ఉదయం లిస్టింగ్ లో ఈ పిటిషన్ ను చేర్చాలని ఆదేశించారు. దీంతో, రేపు ఉదయం ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశముంది.
మరోవైపు, చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ఈ రోజు జరగనుంది. దాంతోపాటు, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును మరో 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెండు రోజుల పాటు సీఐడీ చేపట్టిన విచారణ నివేదికను జడ్జికి సీఐడీ అధికారులు సమర్పించారు. బెయిల్ పిటిషన్ పై సీఐడీ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయగా జడ్జి అభ్యంతరం తెలిపారు. కౌంటర్ సరిగా లేదని, పూర్తి సమాచారంతో మళ్లీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.