విపక్షంలో ఉన్నప్పుడు.. మాకు కానీ అవకాశం ఇస్తే.. ఆకాశాన్ని నేల మీదకు తీసుకొస్తానంటూ బడాయి మాటలు చెప్పేస్తారు. కానీ.. ఒకసారి పవర్ చేతికి వస్తే చుక్కలు చూపించటం షురూ చేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కర్ణాటకలో నెలకొంది. తాజాగా ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రతి నెల బడుగు జీవులకు ఇచ్చే రేషన్ కు తాజాగా ఆ రాష్ట్రంలోని యడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విన్నంతనే తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే.. రేషన్ తీసుకోవాలంటే కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేయటమే దీనికి కారణం.
రేషన్ పొందాలనుకునేవారు ఎవరైనా సరే.. వారి ఇంట్లో టీవీ.. ఫ్రిజ్.. ఇలా ఏ ఒక్కటి ఉన్నా కూడా వారికి రేషన్ ఇవ్వరు. ఒకవేళ రేషన్ కార్డు ఉంటే..దాన్ని ప్రభుత్వానికి వెంటనే అప్పజెప్పాలి. లేని పక్షంలో ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ.. తాజాగా ఆదేశాల్ని జారీ చేసింది. ఇందుకు గడువు కూడా పెట్టింది. మార్చి 31 లోపు తమ వద్ద ఉన్న రేషన్ కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిసైడ్ చేసింది.
కర్ణాటక రాష్ట్ర మంత్రి బెళగావిలో చేసిన ఈ కీలక ప్రకటన ప్రభుత్వంలో సంచలనంగా మారింది. రేషన్ కార్డు కావాలంటే వారికి ఐదు ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. అలానే వారి వద్ద ఫ్రిజ్.. టీవీ.. టూ వీలర్ ఉండరాదని స్పష్టం చేసింది. మిగిలిన నిబంధనల్ని ఓకే. కానీ.. టీవీ అన్నది ఇవాల్టి రోజున ఒక కచ్ఛితమైన సౌకర్యంగా మారింది. అలాంటిది టీవీ ఉంటే.. రేషన్ ఇవ్వకపోవటం అంటే.. సదరు రాష్ట్రంలో 95 శాతం మందికి రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్న మాట వినిపిస్తోంది.
అంతేకాదు.. వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు మించిన వారెవరూ రేషన్ కార్డుకు అర్హులు కారని తేల్చారు. ఇవాల్టి రోజున రోడ్డు పక్కన ప్లాస్టిక్ షీట్లతో తాత్కాలిక ఇళ్లను నిర్మించుకునే వారికి సైతం టీవీలు ఉండే పరిస్థితి. అలాంటిది.. టీవీ ఉంటే రేషన్ ఇవ్వమని చెప్పటం అంటే.. బడుగు జీవులకు కర్రకాల్చి వాత పెట్టటమే అన్న మాట వినిపిస్తోంది. ఇంతకు మించిన చెత్త నిర్ణయం మరొకటి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక రాష్ట్ర మంత్రి ప్రకటించిన ఈ సంచలన నిర్ణయంపై కన్నడుగులు ఎలా స్పందిస్తారో చూడాలి.