- స్థానిక ఎన్నికలు ముగియడంతో పేదలపై అధికారుల కొరడా
- రేషన కార్డులో భర్త పేరు ఉందంటూ
- వితంతు, ఒంటరి మహిళలకు చెక్
- ఆధార్లో వయసు ఎక్కువ చూపారని సాకులు
- సచివాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
సామాజిక పెన్షన్ల సంఖ్య భారీగా తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం దారులు వెతుకుతోంది. స్థానిక ఎన్నికలు పూర్తి కావడం.. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో అధికారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కులాలు, పార్టీల ప్రాతిపదికన పింఛన్లు తీసేశారు.
ఇప్పుడు అర్హత నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను తెగ్గోయడానికి రంగం సిద్ధం చేశారు. సర్వే పేరిట పలు జిల్లాల్లో వైఎస్ఆర్ పెన్షన కానుక పొందుతున్న నోటీసులు ఇస్తుండడంతో లబ్ధిదారులు హడలెత్తిపోతున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే అప్పట్లో రూ.250గా ఉన్న సామాజిక పింఛనును ఒకేదఫా రూ.1000కి పెంచారు. విడతలవారీగా పెంచుదామని అధికారులు ప్రతిపాదించినా.. ఇచ్చిన మాట తప్పలేనని.. ఒకే సారి పెంచాల్సిందేనని స్పష్టంచేశారు.ఆ తర్వాత 2019 జనవరిలో పెన్షన్ను ఒకేసారి రూ.2 వేలకు పెంచేశారు. అప్పటివరకు తాను గద్దెనెక్కితే రూ.2 వేలు చేస్తానన్న జగన్మోహన్రెడ్డి.. రూ.3 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారు. దీంతో మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఆశతో ఓట్లు గుమ్మరించారు.
కానీ జగన్ గద్దెనెక్కాక మాటమార్చేశారు. రూ.2 వేల పెన్షన్ను ఐదేళ్లలో విడతలవారీగా రూ.250 చొప్పున 3 వేలకు పెంచుతానన్నారు. పోనీ ఆ మాటయినా నిలబెట్టుకున్నారా అంటే అదేం లేదు. అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి పెంచిన 250 రూపాయలే ఇప్పటికీ అమలవుతోంది. రెండో విడత ఊసే ఎత్తడం లేదు.
ఇక 45 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఏమైందో తెలియకుండా ఉంది. మరోవైపు.. పెన్షన్ల భారం భరించలేక.. వాటిని పెద్దఎత్తున తగ్గించేందుకు పథకం చేపట్టారు. ఇందులో భాగంగా రేషన కార్డులకు సంబంధించి సర్వే చేపట్టారు. చాలా చోట్ల భర్తలు చనిపోయినప్పటికీ ఇంకా వారి పేర్లతోనే రేషన్ కార్డులు చలామణీ అవుతున్నాయి.
చనిపోయిన వారి పేర్లు తొలగించకుండా పలు రేషన షాపుల్లో ఏళ్ల తరబడి రేషన విడుదల చేస్తున్నారు. కొన్నిచోట్ల లబ్ధిదారులకు తెలియకుండానే డీలర్లు రేషన స్వాహా చేసేవారు.
ఇంటికే బియ్యం పంపిణీ వ్యాన్లు వచ్చినా ఇదే పరిస్థితి. ఈ లోపాలను సరిదిద్దకుండా సర్వే చేపట్టి.. కార్డులో భర్త పేరుందని, రేషన కూడా పొందుతున్నారన్న సాకుతో వితంతు పెన్షన పొందేందుకు అర్హత లేదని నోటీసులిస్తున్నారు. దీంతో భర్త డెత సర్టిఫికెట్ తీసుకుని అప్లోడ్ చేయడం కోసం వారు గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఒంటరి మహిళల కోటాలో పెన్షన పొందుతున్న వారికి కూడా ఇవే చిక్కులు. రేషన కార్డులో భర్త పేరు ఉండడం, ఆయనకు కేటాయించిన సరుకులు కూడా పొందుతుండడంతో దంపతులు కలిసే ఉన్నారని అధికారులు ఆక్షేపిస్తున్నారు. భర్త పేరును కార్డులో నుంచి తొలగించేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఇక ఆధార్ కార్డులో వయసు ఎక్కువ చూపించి పెన్షన పొందుతున్నారని ఇంకొంతమందికి నోటీసులిస్తున్నారు. అలాగే కుమారుడు/కుమార్తె ఆదాయ పన్ను చెల్లిస్తున్నారంటూ ఊళ్లలో ఉన్న వృద్ధ మహిళల పెన్షన్ కోసేస్తున్నారు. వారు కొత్త కార్డు కోసం దరఖాస్తు పెట్టుకోవాలని చెబుతున్నారు.
2019 అక్టోబరు నుంచి ఇలా కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకున్న ఒక్క మహిళకు కూడా కార్డు ఇవ్వకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో దాదాపు 100 మంది వితంతు, ఒంటరి మహిళలు పింఛన్లకు అర్హులు కారంటూ నోటీసులిస్తున్నట్లు తెలుస్తోంది.
పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని వలంటీర్లను ఇళ్ల చుట్టూ తిప్పిన ప్రభుత్వం.. మంజూరుచేసిన తర్వాత ఇప్పుడు రకరకాల నిబంధనలు పెడుతూ తొలగించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నేతలు కన్నెర్ర చేస్తే..
వైసీపీ నేతలు కన్నెర్ర చేస్తే ఊళ్లలో పెన్షన ఇట్టే కట్ అయిపోతోంది. వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి ఫలానా వారికి పెన్షన తీసేయాలని బెదిరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ పెన్షనర్లపై కత్తిగట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే వలంటీర్లను కూడా తొలగించేస్తున్నారు. దీంతో వారు చెప్పినట్లు చేయాల్సి వస్తోందని… ఇష్టం లేకపోయినా అర్హుల పేర్లు తొలగించాల్సి వస్తోందని వలంటీర్లు అంటున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే పెన్షన్లలో కోతపెట్టాలని పై నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల వేతనాలను కూడా ఆపేసి.. అప్పుచేసి ప్రసుత పెన్షన్లను చెల్లిస్తున్నారని.. బ్యాంకులు రుణాలివ్వడం ఆపేస్తే.. సామాజిక పెన్షన్లను ఆపేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.