ఏపీలో పెన్షన్లు , పంపిణీ వ్యవహారంపై నెల రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వాలంటీర్లను సామాజిక పెన్షన్ల పంపిణీ నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే, సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం…ఎన్నికల్లో లబ్ది కోసం టీడీపీపై బురదజల్లే కార్యక్రమానికి తెరదీసింది. సచివాలయాల వద్దకే వచ్చి పెన్షన్లు తీసుకోవాలని కోరింది. అయితే, అవకాశం ఉన్నా దానిని వినియోగించుకోకుండా వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దీంతో, ఈ నెల పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది. మే 1న పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని, 1వ తేదీన దివ్యాంగులు, పేషెంట్లకు పెన్షన్లను ఇంటి దగ్గరికే తీసుకువెళ్లి ఇవ్వాలని, బ్యాంకు ఖాతా ఉన్నవారికి వారి ఖాతాలో పెన్షన్ జమ చేస్తామని, ఖాతాలు లేని వాళ్లకు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. మే 1 కార్మికుల దినోత్సవం అయినప్పటికీ ఖాతాల్లో డబ్బు జమచేశామని ప్రభుత్వం ప్రకటించిందిొ.
కానీ, ప్రతి ఏడాది మాదిరే ఈ రోజు బ్యాంకులకు సెలవు అని, కలెక్టర్లు, లబ్ధిదారులు గమనించాలని బ్యాంకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మేడేను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో, ఈరోజు పెన్షన్ల పంపిణీ లేనట్టేనని, రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మండుటెండలో బ్యాంకుల చుట్టూ లబ్దిదారులు బారులు తీరడం సరికాదని, ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. కానీ, తమ పార్టీకి మైలేజీ కోసం, టీడీపీకి డ్యామేజీ చేయడం కోసం ఇలా కావాలనే వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపిస్తున్నారు.