ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటివేళ.. పుచ్చకాయ తినేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. మిగిలిన కాలాలతో పోలిస్తే.. వేసవిలో పుచ్చకాయ బండ్లు కనిపిస్తాయి. గత ఏడాది రూ.10 – 15 వరకు తీసుకున్న పెద్ద ప్లేటును ఇప్పుడు రూ.25-20 చేసేశారు. అదేమంటే.. పుచ్చకాయ ధరలు పెరిగిపోయినట్లుగా చెబుతున్నారు. నిజంగానే పుచ్చకాయ ధరలు మండుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి.
పుచ్చకాయలు పండించే రైతుల దగ్గర ధర దారుణంగా పడిపోయింది. పంట ఎక్కువగా ఉండటంతో.. కేజీకి రూపాయి నుంచి రూపాయిన్నర మాత్రమే చెల్లిస్తున్నారు వ్యాపారస్తులు. సగటువినియోగదారుడు కేజీ రూ.10 నుంచి రూ.14 మధ్య వరకు చెల్లించే పుచ్చకాయ.. వాటిని పండించిన రైతుకు మాత్రం కేజీకి రూపాయి.. రూపాయిన్నర మాత్రమే ఇస్తున్నారు. దీంతో ధరలు భారీగా పడిపోవటంతో.. పంటను కోసే కార్యక్రమాన్నిరైతులు పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే.. వాటిని కోతకోసి అమ్మటానికి మార్కెట్లకు వచ్చేందుకు అయ్యే ఖర్చులో సగం కూడా రాని దుస్థితి తాజాగా నెలకొంది.
నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లికి చెందిన శ్రీను అనే రైతు ఐదు ఎకరాల్లో గత డిసెంబరులో పుచ్చకాయ సాగు చేశారు. పెట్టుబడులు అన్ని కలిపితే రూ.4లక్షల వరకు ఖర్చయ్యింది. పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో పుచ్చకాయ ధర పడిపోయింది. అలా అని.. నిజంగానే రేట్లు తగ్గిపోయాయా? అంటే.. మార్కెట్లో వినియోగదారుడికి కేజీ రూ.10 చొప్పున అమ్ముతున్న దానిని వ్యాపారులు కేజీ రూపాయికి మాత్రమే అడుతున్నారు.
దీంతో.. కనీసం కూలీ ఖర్చులు కూడా రావన్న ఉద్దేశంతో.. పండించిన పంటను పొలంలో వదిలేస్తున్నారు. మరోవైపు.. సగటుజీవి కొనుగోలుచేసేందుకు మాత్రం భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. హైదరాబాద్ మహానగరంలో చిన్నప్లేట్ లో పుచ్చకాయ ముక్కల్ని రూ.25-30 వరకుఅమ్ముతున్నారు. రైతు లెక్కలో చూస్తే.. కనీసం 20 కేజీల పుచ్చకాయ రావాల్సి ఉంటుంది. మన చేతికి ఇచ్చే పుచ్చకాయ ముక్కలు 200 గ్రాములు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన చూస్తే.. సగటు జీవి కష్టాన్ని వ్యాపారులు ఏ రేంజ్లో దోచేస్తున్నారో కదా?