ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించి నటించిన చిత్రం ‘బింబిసార’. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ ఫాంటసీ మూవీ ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కల్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపై, తాను రొమాంటిక్ సినిమాలు చేయనని, దట్స్ వెరీ క్లియర్ అని తేల్చి చెప్పేశారు కల్యాణ్ రామ్.
తన జీవితంలో చాలా చేదు అనుభవాలున్నాయని, రొమాంటిక్ సినిమాలకు తాను సూట్ కానని తనకు క్లారిటీ ఉందని కళ్యాణ్ రామ్ చెప్పారు.
‘బింబిసార’లో కూడా రొమాంటిక్ సీన్స్ లేవని, రొమాన్స్ ఎక్కువ లేదని క్లారిటీ ఇచ్చారు. కేథరిన్ తో నటించిన ‘ఓ తేనె పలుకుల…’ సాంగ్ చూసి రొమాన్స్ ఎక్కువ ఉందని అనుకోవద్దని కళ్యాణ్ రామ్ చెప్పారు.’బింబిసార’ లాంటి వెయిటేజ్ ఉన్న సోషియో ఫాంటసీ సినిమాకు స్టార్ హీరోయిన్స్ ఉంటే థియేటర్లకు ఎక్కువమంది ప్రేక్షకులు వస్తారని తాను అనుకోవడం లేదని, ప్రేక్షకులు సినిమా కంటెంట్, కథను ఎక్కువ ఆదరిస్తారని అన్నారు.
తాను చిన్నా పెద్దా అని నమ్మనని, ఈ రోజు పెద్దవాళ్ళు ఒకప్పుడు చిన్నవాళ్ళే కదా అని అన్నారు. తమ నటనతో, ప్రతిభతో పెద్దవాళ్ళు అయ్యారని, తమ క్యారెక్టర్లకు తగ్గట్టు, తమ నిర్మాణ వ్యయానికి తగ్గట్టు హీరోయిన్లను ఎంపిక చేసుకున్నామని కళ్యాణ్ రామ్ వివరించారు. ప్రస్తుతానికి ఈ సినిమాను పాన్ తెలుగు సినిమాగానే భావిస్తున్నామని, తెలుగులో ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ నెల 18న పాన్ ఇండియా స్థాయిలో మిగతా భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు.