“మన ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో కొలువుల పండగ ప్రారంభమవుతుంది. యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మేం సిద్ధం. ఇప్పటి లాగా కాదు.. దీనికొక కొత్త విధానం అమలు చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1న కేలండర్ విడుదల చేస్తాం“- ఇదీ పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆర్భాటమైన ప్రకటన.
దీని వెనుక సుమారు 6 లక్షల మంది నిరుద్యోగ యువతను తనవైపునకు, తన పార్టీవైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేశారు జగన్. గత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుగుర్రం ఎక్కడానికి ఈ హామీ కూడా ప్రధానంగా పనిచేసింది. అప్పటికి కొత్తగా ఓటు హక్కు పొందిన 21-25 ఏళ్ల యువతీ యువకులు..వైసీపీ వైపు మొగ్గు చూపారు.
మరి నిజంగానే.. జగన్ మాట నెరవేర్చుకున్నారా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటికి ఆయన అదికారంలోకి వచ్చి… దాదాపు రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఒక్కసారి కూడా యువతకు ఉద్యోగ కల్పన చేసేందుకు ఎలాంటి కేలండర్ ఇవ్వలేక పోయారు. అంతేకాదు.. అత్యంత కీలకమైన గ్రూప్ -1, గ్రూప్-2 వంటి పోస్టుల ప్రకటన కూడా లేక పోవడం గమనార్హం.
ఇప్పటికే గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన గ్రూప్-1, గ్రూప్-2నే ఆఖరుగా ఉంది. పోనీ.. ఉద్యోగాలు లేవా? అంటే.. కుప్పలు తెప్పలుగా ఉన్నాయని ఆయా శాఖ మంత్రులు చెబుతున్నారు. ప్రభుత్వానికి కూడా సిఫారసు చేస్తున్నారు.
అయినప్పటికీ.. జగన్ మాత్రం ఇప్పటి వరకు ఈ దిశగా కృషి చేసింది లేదు. పైగా.. తాము అధికారంలోకి రాగానే 4 లక్షల మంది వలంటీర్లను నియమించామని, సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని చెబుతున్నారే తప్ప.. ప్రభుత్వ పరంగా శాఖాపరమైన ఉద్యోగాలు ఇవ్వడంలోను, తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడంలోనూ జగన్ విఫల మయ్యారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి జగన్ చెప్పింది చేసి ఉంటే.. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇది జగనే చెప్పిన లెక్క. ఇచ్చిన హామీ కూడా. కానీ.. ఇప్పటి వరకు ఆయన ఆదిశగా అడుగులు వేసింది.. లేదు.
దీంతో జగన్ ఇచ్చేది దొంగ హామీలు.. చెప్పేది గాలి కబుర్లు .. అనే కామెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే.. ఉద్యోగాల భర్తీ విషయంలో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయని.. అందుకే సీఎం ముందుకు వెళ్లలేక పోతున్నారనే వాదన కూడా ఉండడం గమనార్హం. నిజమే. ఇబ్బడి ముబ్బడిగా.. సంక్షేమ కార్యక్రమాల పేరుతో సొంత వారికి పంపకాలు ప్రారంభించిన తర్వాత.. రాష్ట్ర ఖజానా బోసిపోతోంది. ఈ నేపథ్యంలోనే యువత హామీపై మాట తప్పి.. కేలండర్ విషయం మడమ తిప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.