జగన్ సీఎం అయిన తర్వాత ఏపీకి పెట్టుబడులు రావడంలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. దావోస్ పర్యటన అంటూ కుటుంబ పర్యటన చేసి తన పనులు చక్కబెట్టుకున్న జగన్…తెచ్చిన పెట్టుబడులు శూన్యం అని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇదే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైనం ఇపుడు టీడీపీ నేతల చేతికి అస్త్రంగా మారింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అధమ స్థానంలో ఉందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య, అభివృద్ధి ప్రోత్సాహక సంస్థ (డి పి ఐ ఐ టి) ఇచ్చిన నివేదిక సంచలనం రేపుతోంది. కర్ణాటక 187%, హర్యానా 67% , ఢిల్లీ 50% వృద్ధి సాధిస్తే .. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఒక్క డాలర్ కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రాలేదని ఆ నివేదికలో తేలింది. అదే చంద్రబాబు హయాంలో అయితే కియా రూపంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏపీకి వచ్చింది.
13వేల కోట్ల రూపాయల పెట్టబడిని కియా ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. చిత్తూరులో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. తద్వారా రాష్ట్రానికి వందల కోట్ల రూపాయల రాబడిని ట్యాక్సుల రూపంలో తెచ్చిపెట్టింది. ఇక, ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చొరవతో ఏర్పాటైన ఎపిపి సినార్మ్స్ (ఏషియా పల్ప్ & పేపర్) సంస్థకు భూముల కేటాయింపు కూడా జరిగింది. కానీ, జగన్ అన్న పాలన చూసి ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఈ సంస్థ గనుక వచ్చి ఉంటే.. రూ 24 వేల కోట్లతో ఇదే దేశంలో మొదటి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయ్యి ఉండేది.
దీంతో, జగన్ పై ట్రోలింగ్ జరగుతోంది. చంద్రబాబు సుందర వదనం చూసి పెట్టుబడులు వస్తాయా అని నాడు ఎద్దేవా చేసిన జగన్ ఈ రోజు తన మొహం చూసి రూపాయి కూడా పెట్టుబడులు రావడం లేదని తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేస్తున్నారు.