ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం నివ్వెరబోతోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలన, తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందంటే అతిశయోక్తి కాదు. పప్పు, బెల్లం పంచినట్లు ఖజానాలోని డబ్బులన్నీ పథకాలకు పెడుతున్న జగన్….ఆదాయం కోసం అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిండుకున్న ఖజానాని నిండుకుండలా చేసేందుకు జగన్ సినిమా టికెట్లపై పడ్డారని, ఇందుకే ఆన్ లైన్ టికెటింగ్ విధానం తెచ్చారని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక, కరోనా రెండు వేవ్ ల దెబ్బకు కుదేలైన చిత్రపరిశ్రమపై జగన్ తీసుకున్న టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయం…మూలిగే నక్కపై తాటికాయ అన్న చందంగా తయారైందని విమర్శలు వచ్చాయి. టికెట్ల రేట్లు పెంచకపోతే థియేటర్లు మూసుకోవాల్సిందేనని థియేటర్ల యజమానులు చెబుతున్నా…సరే..ఈ వ్యవహారంపై ఏమాత్రం వెనక్కు తగ్గలేదు జగన్.
ఈ క్రమంలోనే దాదాపుగా తగ్గించిన పాత రేట్లనే మరోసారి కొద్ది పాటి సవరణలతో కొత్తగా విడుదల చేసింది జగన్ సర్కార్. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలకు విడివిడిగా రేట్లు ప్రకటించింది ఇక, అంతకుముందున్న నిర్ణయాన్నే కొనసాగిస్తూ ఏపీలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది. ఏపీలో సినిమా టికెట్ల తాజా రేట్లు చూసిన యజమానులు థియేటర్లు మూతవేసుకోవాల్సిందేనన్న టాక్ వస్తోంది.
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో
మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీ ప్రాంతాల్లో
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీల్లో
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో
మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5