తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి! అన్నట్టుగా ఉంది ఏపీలో వైసీపీ పాలన అంటున్నారు ప్రజలు. “ఏపీ వెళ్లి చూడండి.. నడుము లోతు గుంతలు.. “ అని పొరుగు రాష్ట్రం మంత్రి వ్యాఖ్యానించినా.. తాను చేయాలనుకున్నదే చేస్తున్నారు ఏపీసీఎం. అదేసమయంలో ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. తను ఎప్పుడు చేస్తే.. అప్పుడే పండగని చెబుతున్నారు. ఇదీ.. ఏపీలో ఇప్పుడు వినిపిస్తున్న.. రోడ్లపై కనిపిస్తున్న పరిస్థితి!!
రహదారుల విషయంలో ఏపీ ప్రబుత్వం అనుసరిస్తున్న తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా ఎండగడుతున్న విషయం తెలిసిందే. గతంలో అక్టోబరు 2 నాడు ఏపీలో రహదారులపై పోరు కార్యక్రమాన్ని జనసేన అధినేత ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే.
రోడ్లపై నడుములోతు గుంతలు ఉన్నాయని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఆయన నిలదీశారు. అయితే.. జగన్ సర్కారు అప్పటికప్పుడు హడావుడి చేసినా.. తర్వాత మరిచిపోయింది. ఇక, ఇప్పుడు దీనిపై తేల్చేసింది. మరో ఏడాది వరకు రహదారులు ఇంతే! అని సీఎం జగన్ తేల్చేశారు. మరి జనం.. ఎవరి చావు వారు చావాల్సిందే! అని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ముఖ చాటేస్తోంది. గత ఏడాది రోడ్లు వేస్తున్నామని.. చెప్పిన జగన్.. ఇప్పుడు మళ్లీ మడమ తిప్పేశారు. వచ్చే ఏడాది వరకు రహదారుల బాగుజేతను సాగదీశారు. అంటే, మరో ఏడాది వరకు రాష్ట్రంలో గతుకులు, గుంతలు, గోతుల రోడ్లే ఉంటాయని చెప్పకనే చెప్పారు.
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లపాటు రహదారి మరమ్మతులు సరిగ్గా చేపట్టని సర్కారు, రోడ్లు ఎందుకు బాగోలేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వ వైఫల్యమంటూ నెట్టుకొచ్చింది. బ్యాంక్ నుంచి 2వేల కోట్ల అప్పు తీసుకొచ్చి కూడా నిర్దిష్టకాలంలో రహదారి మరమ్మతులు చేపట్టలేక, గడువును మరో ఏడాదికి పొడిగించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంమవుతోంది.
గడిచిన మూడేళ్లకాలంలో సర్కారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు ఎన్ని? వాటి విస్తీర్ణం ఎంత అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతోంది. సర్కారు చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం ఏటా 8 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలి.
గోతులు పడి పాడైన వాటికి మరమ్మతు పనులు చేపట్టాలి. ఆ లెక్కన మూడేళ్ల వ్యవధిలో 24 వేల కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం సర్కారుకు నికరంగా రూ.6,000 కోట్లు అవసరం.
అయితే.. ఇంత మొత్తం ఇచ్చే దిక్కులేదు. మరోవైపు రహదారుల మరమ్మతుల పేరుతోనే పెట్రోల్, డీజిల్పై సెస్సు వసూలు చేస్తున్నారు. కానీ, ఆ నిధులను సర్కా రు సొంత అవసరాలకు వాడుకుంటోంది. రోడ్లకోసం రూపాయి కూడా వినియోగించలేదు.
దీంతో ఎప్పటికప్పుడు.. రోడ్ల పరిస్తితి పై ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తూ.. ప్రజలతో రోడ్లపై పిల్లి మొగ్గలు వేయిస్తోంది! తాజాగా కేంద్రం ఇచ్చిన రహదారి ప్రమాదాల జాబితాలో.. ఏపీ రెండో స్థానంలో ఉంది. దీనికి కారణం.. రాష్ట్రంలో రహదారులు బాగోకపోవడమేనని కేంద్రం కుండబద్దలు కొట్టింది.