మాజీ సీఎం జగన్ అపరిపక్వ నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి వల్లే తీవ్ర ప్రజా వ్యతిరేకత పెల్లుబికి వైసీపీ ఓటమి పాలైందన్నది ‘జగన్’ ఎరిగిన..జగమెరిగిన సత్యం. అయితే, ఏదో అన్యాయం జరిగింది..ఆధారాల్లేవు, ఈవీఎంల ట్యాంపరింగ్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలి అంటూ తన ఓటమిని ఈవీఎంల ఖాతాలో వేసే ప్రయత్నాలను జగన్ ముమ్మరంగా చేస్తున్నారు.
ఆ పార్టీ నేతలు కూడా జగన్ పాఠాన్ని భట్టీ పట్టి జనంలోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ జగన్ కు షాకిచ్చారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణం కాదని, అది శుద్ధ అబద్ధం అని రాపాక తేల్చేశారు. 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయడం, ఓట్ షేరింగ్ జరగడం, తమకు ప్రజలు ఓట్లేయక పోవడం వల్లే ఓడామని అసలు వాస్తవాన్ని రాపాక నిర్భయంగా ఒప్పుకున్నారు.
వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసని, కూటమిలోని పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసని, ఈవీఎం ట్యాంపరింగ్ ఏమీ లేదని ఒక్క ముక్కలో అసలు నిజం ఒప్పేసుకున్నారు రాపాక. మరి, ఫ్లోలో మాట్లాడినా..నిజం చెప్పిన రాపాకపై జగన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, రాపాక తన సొంతగూటికి వెళ్లే క్రమంలోనే ఈ కామెంట్లు చేశారని, త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకుంటారని పుకార్లు వస్తున్నాయి.