గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్లేందుకే వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారని వారు గొప్పలు చెబుతున్నారు. అయితే, పథకాలు చేరవేయడం, పెన్షన్ ఇవ్వడం వంటి పనుల వరకు వాలంటీర్లు సేవల అభినందనీయం అయినప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రం వాలంటీర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు ఓటేయాలని లేదంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు ఓటర్లను బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తమకు కేటాయించిన 50 ఇళ్లలో వాలంటీర్లు అభ్యర్థులతో పాటు కలిసి ప్రచారం కూడా చేసినట్టు పుకార్లు వచ్చాయి. దీంతో ఆ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గతంలో వాలంటీర్లకు ఎన్నికల సంఘం, కోర్టు వార్నింగ్ ఇచ్చాయి.
అయినా సరే తీరు మారని వాలంటీర్లు తాజాగా ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు వాలంటీర్లకు సంబంధించి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎంకే మీనా సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ ఇంతకుముందే వాలంటీర్లకు ఆధార్-ఓటర్ ఐడి అనుసంధాన ప్రక్రియ అప్పగించి ఉంటే వారిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఈ ప్రకారం కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు పాటించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వాలంటీర్లు ఏజెంట్లుగా కూడా ఉండకూడదని మీనా ఆదేశించారు. టీడీపీ ఎన్నికల ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుతో మీనా ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.