ఏపీ అధికార పార్టీ వైసీపీ కి పెద్ద సంకటం పట్టుకుంది. కీలక నాయకులు.. ఒక్కొక్కరుగా ఎన్నికలకు ముందు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఒకే రోజు గుంటూరు జిల్లాలో నాయకులు రాజీనామా బాట పట్టారు. ఇప్పటి వరకు పార్టీలో తెరచాటున ఉండి సాయం చేసిన.. తాడిశెట్టి సోదరులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు, నగర డిప్యూటీ మేయర్‌గా తాడిశెట్టి మురళీ పని చేశారు. వీరిద్దరూ వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారని అనుచరులు తెలిపారు.
తాడిశెట్టి మురళి మాట్లాడుతూ.. వైసీపీలో తమకు కనీస గుర్తింపు లేదన్నారు. తమ అనుచరులకు ప్రాధాన్యమివ్వడం లేదని తెలిపారు. వైసీపీలో దళారులు ఉన్నారని విమర్శించారు. జగన్ కలవడం కంటే వేంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. గతంలో దాడి వీర భద్రరావు, పెనమలూరు ఎమ్మెల్యేకొలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా వ్యాఖ్యానించారు. సో.. మొత్తానికి తాడిశెట్టి వర్గంవైసీపితో రాజీ లేకుండా.. రాజీనామా వైపే మొగ్గు చూపింది.
మరోవైపు.. కీలకమైన రాజధాని ప్రాంతం వెలగపూడికి చెందిన జొన్నలగడ్డ కిషోర్ అనే ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా వైసీపీని వీడియారు. “27 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను. వైసీపీ స్థాపితం తరువాత జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచా. వైసీపీ లో వున్నా కూడా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నా. రాజదాని అమరావతిని మార్చనని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తర్వాత ఆ మాట తప్పారు. అమరావతి విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో జగన్ మాట తప్పారు. అందుకే రాజీనామా చేస్తున్నా“ అని కిషోర్ అన్నారు.
కట్ చేస్తే..
వీళ్లు చిన్నవాళ్లే కదా.. అని అను కోవచ్చు. వీరికి గ్రాఫ్ లేదు కదా! అని భావించవచ్చు. కానీ, చలిచీమల దండు మాదిరిగా.. క్షేత్రస్థాయిలో వీరు చేసే ప్రచారమే ఎక్కువగా ఉంటుంది. అది వ్యతిరేకమైనా.. సానుకూలమైనా.. ఇలాంటి వారు చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. కనీసం ఎన్నికల ముందు అయినా.. పార్టీ నాయకులు భేషజాలకు పోకుండా.. చర్చించి ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరంఎంతైనా ఉందనేది పరిశీలకుల అంచనా.