మంచి క్రేజున్న సినిమాకు రిలీజ్ డేట్ ఇవ్వడం.. తర్వాత డేట్ మార్చడం చాలా మామూలు విషయం అయిపోయింది. ఒకప్పుడైతే ఇలా డేట్ మార్చడానికి సంశయించేవాళ్లు, దాన్నో నెగెటివ్ విషయంలా చూసేవారు కానీ.. కరోనా టైంలో పెద్ద పెద్ద సినిమాలు సైతం నాలుగైదు సార్లు వాయిదా పడటంతో ఈ మార్పు అనేది చిన్న విషయం అయిపోయింది. ఐతే ఎప్పుడైనా డెడ్ లైన్ అందుకోలేక సినిమాను వాయిదా వేయడమే చూస్తాం కానీ.. ముందుకు తీసుకురావడం అరుదు. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలోనే చేరబోతోంది.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీనుల కొత్త సినిమా. ఈ చిత్రాన్ని ముందు దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. డేట్ కన్ఫమ్ చేయలేదు కానీ.. దసరా అక్టోబరు చివరి వారంలో కావడంతో అప్పుడే సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాతేమో సినిమాను ప్రి పోన్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి.
అనుకున్న దానికంటే 40 రోజుల ముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబరు 15న తమ సినిమా విడుదల కానున్నట్లు శుక్రవారం అధికారికంగానే ప్రకటించింది చిత్ర బృందం. ఈ మార్పుకు ప్రధాన కారణం.. బాలయ్య సినిమాతో బోయపాటి చిత్రాన్ని పోటీకి దింపకూడదనే. బాలయ్య, బోయపాటికి ఉన్న అనుబంధం తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన సింహా, లెెజెండ్, అఖండ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్బస్టర్లయ్యాయి.
త్వరలోనే వీరి కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా రాబోతోంది. బోయపాటితో వ్యక్తిగతంగా కూడా బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో దసరాకే రాబోతున్న బాలయ్య కొత్త చిత్రం ‘భగవంత్ కేసరి’కి పోటీగా తన సినిమాను రిలీజ్ చేయాలని బోయపాటి అనుకోడు. ఈ రెండు చిత్ర బృందాలు కమ్యూనికేషన్ లేకుండా వేర్వేరుగా తమ సినిమాలను దసరా రేసులో నిలిపాయి. ఐతే తమ చిత్రం అంతకంటే ముందే రెడీ అయ్యేలా ఉండటంతో బోయపాటి వెనక్కి తగ్గి సెప్టెంబరు రిలీజ్కు రెడీ అయిపోయాడు. ఈ నిర్ణయం పట్ల బాలయ్య అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.