తొలిరోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా మంత్రివర్గం ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తవుతోంది. మరో వారం రోజుల్లో జగన్ చెప్పిన గడువు పూర్తయిపోతుంది. మరప్పుడు చెప్పినట్లుగా మంత్రివర్గంలో 90 శాతం మందిని మార్చేస్తారా ? లేకపోతే మొత్తం అందరినీ మార్చేస్తారా ? అనే విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయాయి.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనతో సహా మొత్తం అందరినీ మార్చేస్తారని స్పష్టంగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే బాలినేని మాటలు నిజమే అయితే మొత్తం 25 మందీ కొత్త వారే కనిపించాలి.
ఇదే సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని లాంటి వాళ్ళని కంటిన్యు చేస్తు మిగిలిన వారినందరినీ మార్చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. వివిధ కారణాలతో సామాజిక వర్గాల కూర్పు కారణంగా మొదట్లోనే చెప్పినట్లు 90 శాతం కొత్తవారిని తీసుకుంటారనే అనుకుంటున్నారు.
అంటే జగన్ చెప్పినట్లు 10 శాతం మంత్రులను కంటిన్యూ చేస్తారని అనుకుంటే 25 మందిలో 10 శాతమంటే 2.5 శాతం. శాతంలో 2.5 అంటే సంఖ్యాపరంగా ముగ్గురు అని అనుకోవచ్చు. కాబట్టే ముగ్గురిని మాత్రం జగన్ కంటిన్యూ చేస్తారనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది. పై నలుగురు మూడు సామాజిక వర్గాలకు చెందిన నేతలు. అందుకనే నలుగురిలో కంటిన్యూ అవబోయే ముగ్గురు ఎవరో అర్థం కావటంలేదు.
పెద్దిరెడ్డి రాయలసీమకు చెందిన వారు. పైగా చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని ప్రత్యేకించి కుప్పంలో చంద్రబాబునాయుడును లేవనీయకుండా దెబ్బకొట్టాలంటే పెద్దిరెడ్డి మంత్రిగా కంటిన్యు అవ్వాల్సిన అవసరం చాలావుందనే ప్రచారం జరుగుతోంది.
అలాగే కృష్ణాజిల్లా నుండే కొడాలి, పేర్ని ఉన్నారు. వీరిద్దరు కమ్మ, కాపు సామాజికవర్గాలకు చెందిన నేతలు. కమ్మ సామాజికవర్గం కోసం కొడాలిని కంటిన్యు చేయాల్సిన అవసరం జగన్ కు ఉందంటున్నారు. ఇక పేర్ని, ఆళ్ళ ఇద్దరు కాపులే. వీరిలో ఆళ్ళ చాలా సాఫ్ట్ అయితే పేర్ని మాటకారే కాకుండా బాగా దూసుకుపోతారు. కాబట్టి ఇద్దరిలో పేర్ని కంటిన్యు చేయటానికే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.
హోలు మొత్తం మీద సామాజిక వర్గాలు, వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే పై ముగ్గురు కంటిన్యూ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా జగన్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనకు సమయం కూడా కాదు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆరు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. కాబట్టి ఇపుడు మంత్రివర్గ ప్రక్షాళన ఎలాగు జరగదు. అందుకనే డిసెంబర్ చివరి వారంలో కానీ లేదా జనవరి మొదటి వారంలో కానీ ముహూర్తం ఉండచ్చని అనుకుంటున్నారు నేతలు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.