2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో పొత్తుల వ్యవహారంపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీని మినహాయిస్తే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య ఏ రెండు పార్టీలకు పొత్తు ఉంటుంది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అయితే, రాష్ట్రంలో వైసీపీ బలహీనపడటం, అదే సమయంలో టీడీపీ బలపడడం వంటి కారణాల నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ అగ్ర నేతలు కూడా మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరిగింది.
ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని టాక్ వచ్చింది. అయితే, ఎన్నికలనాటికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై సముచిత నిర్ణయం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారు. దీంతో, బీజేపీతో టీడీపీ పొత్తుపై క్లారిటీ రాలేదు. అదే సమయంలో టీడీపీతో దోస్తీకి బీజేపీ ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలోనే జనసేనను బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారన్న టాక్ వస్తోంది. టీడీపీతో లేదా బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోక తప్పదన్న భావనలో బీజేపీ పెద్దలున్నారని టాక్ వచ్చింది.
బీజేపీలో జనసేన విలీనమైతే పవనే సీఎం అభ్యర్థి అని ప్రకటించాలని జనసేన నేతలు కోరుకుంటున్నారని, కానీ, అందుకు బీజేపీ పెద్దలు సుముఖంగా లేరని ఊహాగానాలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చిందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జనసేనతో బీజేపీ పొత్తులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పందించారు.
ఏపీలో జనసేనతో తప్ప మరే ఇతర పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోబోదని లక్ష్మణ్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని లక్ష్మణ్ తేల్చి చెప్పేశారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని, బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీదే అధికారమని, ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీని స్వాగతిస్తున్నానని చెప్పారు. ఏది ఏమైనా, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదంటూ లక్ష్మణ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.