ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ దానిని తుంగలో తొక్కి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. మద్యం ధరలు పెంచేసి నాసిరకం మద్యాన్ని, వైసీపీ నేతల కంపెనీల మద్యాన్ని జగన్ ఏపీలో సరఫరా చేస్తున్నారని వారు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక మొన్న మొన్నటి వరకు ఏపీలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు లేకుండా క్యాష్ రూపంలోనే నగదును స్వీకరించేవారు. ఆ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిరోజుల నుంచి ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని కూడా మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. మద్యం షాపులలో వచ్చిన క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న అని గంటా ప్రశ్నించారు. టీ స్టాల్ మొదలు ఫైవ్ స్టార్ హోటల్ వరకు ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్ ల వైపు పరుగులు పెడుతోందని, కానీ జగనన్న మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ పేమెంట్ కి అవకాశం లేదని దుయ్యబట్టారు. మద్యం షాపుల్లో క్యాష్ లావాదేవీలకు లెక్కాపత్రాలు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నించారు. నాసిరకం మద్యం అమ్ముతూ పేదలను దోపిడీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే అని ఆరోపించారు.
ప్రీమియం పేరును మాయం చేసి బ్రాండ్లను మార్చేసి నికార్సయిన మద్యానికి స్వస్తి పలికారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జే బ్రాండ్లతో హానికరమైన మద్యాన్ని ప్రజలకు ఎక్కించారని ఆరోపించారు. అమ్మ ఒడి డబ్బులను నాన్న బుడ్డి లెక్కతో సరిపెడుతున్నారని, కల్తీ మద్యంతో పేదలను దోచిన జగన్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.