తెలంగాణలో.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం మామూలుగానే ఉంది కదా అని తిరుమల ప్రయాణాలేమైనా పెట్టుకుని ఉంటే వెంటనే అవన్నీ రద్దు చేసుకోవాల్సిందే. తిరుపతి, తిరుమలల్లో బుధవారం రాత్రి నుంచి పరిస్థితులు ఏమీ బాగా లేవు. చెన్నైని ముంచెత్తుతున్న నివార్ తుఫాను ప్రభావం చిత్తూరుతో పాటు తీర ప్రాంత జిల్లాలు చాలా వాటిపై ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్నట్లుండి పరిస్థితి భయానకంగా మారింది.
కొన్ని వారాల కిందట తెలుగు రాష్ట్రాలు రెండింట్లోనూ భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత వాతావరణం మామూలు స్థాయికి చేరింది. ఇక వర్షం బెడద తప్పిందనే అనుకున్నారు. కానీ ఇప్పుడు నివార్ తుఫాను మళ్లీ తీర ప్రాంతాన్ని వణికించేస్తోంది. తిరుపతి, తిరుమల్లో ఇప్పుడు వర్షం ధాటికి జనాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.
ఈ ఉదయం నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలన్నింటినీ ఆపేశారు. అక్కడ భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగి పడుతున్నాయి. తిరుమలలో విరామం లేకుండా వర్షం పడుతోంది. తిరుపతి ఎయిర్ పోర్టును కూడా మూసేయాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు. ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి వచ్చే మార్గంలో వరద భయపెడుతోంది. స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ జనాల్ని భయపెడుతోంది.
గురువారం ఉదయం ఒక వైపు నుంచి మామూలుగా రోడ్డు దాటిన ముగ్గురు వ్యక్తులు తిరిగి వెనక్కి వచ్చి చూసేలోపు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ ముగ్గురూ వరదలో చిక్కుకున్నారు. అందులో ఇద్దరిని కాపాడగా ఒకరు గల్లంతయ్యారు. తిరుపతి నగరమంతటా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుమల కొండల మీది నుంచి వచ్చే నీరు ప్రవహించే కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దాని పరిసరాల్లో ఉండే కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంది.