https://twitter.com/B5001001101/status/1630938680893538310
కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షలు, బంగారు ఆభరణాలు, తలపై పెద్ద పాగాతో ఓ మహిళ ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు.. ఫ్రేములో ఆమె ఒక్కరినే చూస్తే ఏదో ఆధ్యాత్మిక సమావేశం అనుకుంటారు ఎవరైనా.. కానీ, ఆమె మాట్లాడుతున్నది జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో. అక్కడ ఆమె తన ప్రసంగంలో భారతదేశంపై ఆరోపణలు గుప్పించారు.
ఇంతకీ ఆమెది ఏ దేశమో.. ఏ హోదాతో ఐరాసలో ప్రసంగించారో తెలుసా?
ఆమెది కైలాస దేశం. ఆ దేశానికి అధిపతి భారతదేశం నుంచి వెళ్లిన నిత్యానంద. ఐరాసలో ప్రసంగించిన ఈ మహిళ పేరు విజయప్రియ నిత్యానంద. కైలాస దేశానికి ఐరాసలో శాశ్వత రాయబారినని చెప్తున్నారు.
కైలాస పేరుతో నిత్యానంద సృష్టించుకున్న ప్రత్యేక దేశం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యారు. తనను తాను విజయ ప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఈ మహిళా ప్రతినిధి.. నిత్యానందను భారత సర్కారు వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు.
జెనీవాలో గతవారం జరిగిన కమిటీ ఆన్ ఎకనమిక్, సోషల్, కల్చరల్ రైట్స్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశంగా కైలాసను నిత్యానందను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. హిందూ సంప్రదాయాలను, నాగరికతను ఆయన పునరుద్ధరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత కైలాస నుంచి మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ కూడా నిత్యానందకు మద్దతుగా కైలాస గొప్పతాన్ని గురించి మాట్లాడారు. ఇంతకీ ఆ సమావేశాలకు ఎలా అనుమతి దొరికింది అంటే… అవి ఓపెన్ మీటింగ్స్. ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. కాకపోతే ముందే దరఖాస్తు చేసుకోవాలి. అ పాయింట్ ను పట్టుకుని వార్తల్లోకెక్కాడు నిత్యానంద. ఐక్యరాజ్య సమితి వీరి మాటలను పట్టించుకోలేదని తర్వాత వార్త వచ్చింది. కానీ అది వైరల్ కాలేదు.
ఇకపోతే ఐరాస సమావేశంలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించిన విజయప్రియ నిత్యానందకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది. అక్కడున్న ప్రొఫైల్ ప్రకారం చూస్తే కెనడాలో మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ చదివినట్లు ఉంది. ఆమె ఇంగ్లిష్, ఫ్రెంచ్, పిజిన్స్ భాషల్లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో ఉన్నాయి.
కాగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యానందపై భారత్లో నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ అయ్యింది. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గర ఓ ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించారు. ఇక అక్కడ తన కరెన్సీని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆ దేశ ప్రతినిధులుగా ఇద్దరు ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడడం భారతదేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
https://twitter.com/obsolete_utopia/status/1630576610096345088