వరుసగా మూడోసారి ప్రధాని గా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఢిల్లీలో హైడ్రామాకు తెర లేచిందని తెలుస్తోంది. నాగ్ పూర్ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన నితిన్ గడ్కరీని ప్రధానిని చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని తెలుస్తోంది. గడ్కరీ ప్రధాని అభ్యర్థి అయితే ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చేందుకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు రెడీగా ఉన్నారని హస్తినలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం వయసు 73. బీజేపీ పెట్టుకున్న 75 ఏళ్ల తర్వాత పదవీ విరమణ నిబంధన పూర్తికావడానికి మోడీకి మరో రెండేళ్ల సమయం ఉంది. కాబట్టి, మొదటి రెండేళ్లు అంటే 2024-2026 వరకు ప్రధానిగా తనకు అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత గడ్కరీని ప్రధానిని చేయాలని మోడీ కోరుతున్నారట.
కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని అంతా భావిస్తున్నారు. ఈ నెల 9న ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రధాని అయిన రికార్డును తన పేర రాసుకుందామని మోడీ అనుకుంటున్నారు. ఈ తరుణంలో గడ్కరీని ప్రధానిని చేయాలన్న ఆర్ఎస్ఎస్ ప్రతిపాదన పుకారు మోడీకి, ఆయన అభిమానులకు షాకిచ్చిందని చెప్పవచ్చు.
మరోవైపు, ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగ్‌పూర్‌లో గడ్కరీ ప్రధాని కావాలంటూ ఆయనకు మద్దతుగా హోర్డింగులను ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారు. నాగ్‌పూర్ నుంచి వరుసగా మూడోసారి నితిన్ గడ్కరీ గెలుపొందారని, ఆయన ప్రధాని కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గడ్కరీకి శుభాకాంక్షలు చెప్తూనే ఆయన ప్రధాని కావాలని తమ కోరికను ఈ హోర్డింగుల రూపంలో బయటపెట్టారు. మోడీ ఇమేజ్ మసకబారిందని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక వేరే పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుర్రుగా ఉన్నారట.