ఎప్పుడు ఎవరిని ఎంత మాట పడితే అంత మాట అనేసే విషయంలో వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముందుంటారు. ఆయనకు కోపం వస్తే.. ఆయన నాలుక ఏ రీతిలో తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆగ్రహంతో ఎవరినైనా ఇట్టే మాట అనేసే ఆయన.. అంతకు ముందు నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదన్న నీతి బోధనల్ని తనకు తానే మర్చిపోతుంటారు.
తాజాగా దేశంలోనే అత్యున్నత సంస్థల్లో ఒకటైన నీతి ఆయోగ్ పైన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్లే.. దాని ఏలుబడిలో ఉంటుందన్న పేరున్న నీతి ఆయోగ్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ ఒక పనికి మాలిందని.. భజన బృందంగామారిందంటూ ఆ సమావేశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజాగా ఢిల్లీలో జరగాల్సిన నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో.. సదరు సంస్థ తాజాగా స్పందించింది.
కేసీఆర్ వ్యాఖ్యలకు అంతే ధీటుగా స్పందించిన నీతి ఆయోగ్.. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణ అర్థరహితం. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థ ఏర్పాటు చేశారు. గత ఏడాదిలోనే ముప్ఫైకి పైగా సమావేశాన్ని ముఖ్యమంత్రులతో నిర్వహించాం. గత ఏడాది జనవరి 21న రాష్ట్రం డెవలప్ మెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సీఎంతో భేటీ అయ్యాం. అనంతరం పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి అస్సలు స్పందించలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
అంతేకాదు.. కేంద్రం రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్న నీతి ఆయోగ్.. 2015-16లో రూ.2.03 లక్షల కోట్లు.. 2022-23 ఏడాదికి రూ.4.42 లక్షల కోట్లకు ఆర్థికంగా సాయాన్ని అందించిందన్నారు. జల్ జీవన్ మిషన్ కిందకు రూ.3982 కోట్లు కేటాయింపులు జరిగితే.. తెలంగాణ రాష్ట్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించినట్లుగా పేర్కొని.. సీఎం కేసీఆర్ సర్కారు గాలి తీసే ప్రయత్నం చేసినట్లుగా తాజా వివరణ ఉండటం గమనార్హం. మరి.. దీనికి కేసీఆర్ సర్కారు ఎలాంటి బదులిస్తారో?