టాలీవుడ్లో దర్శకుడు వేణు శ్రీరామ్ది విచిత్రమైన ప్రయాణం. ‘ఓ మై ఫ్రెండ్’ లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. రెండో సినిమాను రవితేజ లాంటి స్టార్ హీరోతో సెట్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా ఆగిపోయి కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. ఆపై నాని హీరోగా ‘ఎంసీఏ’ చేసి హిట్టు కొట్టాడు.
తర్వాత అల్లు అర్జున్‌తో ‘ఐకాన్’ సినిమాను అనౌన్స్ చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఈ లోపు అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘పింక్’ సినిమాను రీమేక్ చేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రమే.. వకీల్ సాబ్. మాతృకను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు చాలా బాగానే మార్చి మంచి ఫలితాన్నే రాబట్టాడు వేణు. కానీ ‘వకీల్ సాబ్’ తర్వాత రెండేళ్లుగా అతడికి సినిమా లేకపోవడం ఆశ్చర్యకరమే. ‘వకీల్ సాబ్’లో పవన్‌ను ప్రెజెంట్ చేసిన విధానం చూసి స్టార్ హీరోలు అతడితో సినిమా చేయడానికి ముందుకొస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
పవన్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసిన వాడు.. చివరికిప్పుడు పవన్ ఫ్యాన్ అయిన నితిన్‌తో సర్దుకుపోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి దిల్ రాజు బేనర్లోనే సినిమాలు చేస్తూ వస్తున్న వేణు.. మళ్లీ ఆయనకే తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు.
వేణుతో తాను ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ఈ మధ్యే దిల్ రాజు మీడియాకు వెల్లడించాడు. కానీ ఇందులో హీరో ఎవరో చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం నితిన్ కోసం ఒక యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ రెడీ చేశాడట వేణు. కథ నచ్చింది, పైగా దిల్ రాజు ప్రొడక్షన్.. ఇక నితిన్ కాదనడానికి కారణాలు లేకపోయాయి.
రాజు సంస్థను నిలబెట్టిన ‘దిల్’ తర్వాత.. కొన్నేళ్ల కిందట ఆయన బేనర్లో ‘శ్రీనివాస కళ్యాణం’ చేశాడు నితిన్. కానీ అది తేడా కొట్టేసింది. మళ్లీ ఇప్పుడు రాజుతో జట్టు కడుతున్నాడు. ప్రస్తుతం నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీని తర్వాత వెంకీ కుడుముల సినిమా కూడా లైన్లో ఉంది.