బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. అంతకు ఒక్కరోజు ముందు అంటే 15వ తేదీన శాసనసభా పక్ష నేతగా కొత్తగా ఎన్నికైన ఎంఎల్ఏలు నితీష్ ను ఎన్నుకుంటారు. సరే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవటం, మరుసటి రోజు సిఎంగా ప్రమాణం చేయటం అంతా రోటీనే అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి నితీషే అంటు ప్రధానమంత్రి నరేంద్రమోడితో సహా చాలామంది ప్రకటించేశారు కాబట్టి ఇందులో కొత్తగా ట్విస్టులేమీ ఉండే అవకాశాలు లేవు.
కాకపోతే ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణం చేయబోతున్న నితీష్ కు తర్వాతంతా ముళ్ళబాటే అనే ప్రచారం మొదలైపోయింది. ఎందుకంటే మొదటి మూడు టర్ములు ముఖ్యమంత్రిగా ఏకపక్షంగా పరిపాలన చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగోసారి ఏకపక్ష నిర్ణయాలు, పరిపాలన సాద్యం కాదని అర్ధమైపోయింది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 115 సీట్లలో 73 సీట్లను గెలిచింది. జేడీయూ పోటీ చేసిన 110 సీట్లలో 43 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే జేడీయూ చాలా తక్కువ సీట్లనే గెలిచినా ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇష్టం లేకపోయినా నితీష్ ను సిఎంను చేశారు.
ఈ విషయాలపై ముందుగానే సంకేతాలు వచ్చేశాయి. తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీయు నేత నితీష్ ను ముఖ్యమంత్రిని చేయటం ఏమిటంటు బీజేపీలోని కొందరు ఎంఎల్ఏలు గట్టిగా వాదనకు దిగినట్లు సమాచారం. నితీష్ ను సిఎంగా ఎంపిక చేస్తే అంగీకరించేది లేదంటు 20 మంది ఎంఎల్ఏలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇది నిజమే అయితే కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే నితీష్ ఉంటారు కానీ పరిపాలన మొత్తం బీజేపీ చేతుల మీదుగానే జరుగుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే డ్రైవర్ సీటులో నితీషే కూర్చున్నా స్టీరింగ్ మొత్తం బీజేపీ చేతిలో ఉంటుందని అర్ధమవుతోంది.
ఈ పరిస్ధితుల్లో సిఎం కుర్చీలో ఎన్నిరోజులు నితీష్ సాఫీగా కూర్చోగలడనే విషయంపై ప్రచారాలు జోరుగా మొదలైపోయాయి. సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా తర్వాత విభేదాలు వచ్చి కూటమి నుండి బయటకు వచ్చేసిన అనుభవం బీజేపీకి బాగానే ఉంది. కర్నాటక, మహారాష్ట్రాల్లో ఏమి జరిగిందనే విషయాన్ని కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు. మంత్రివర్గంలో ఎక్కువమందిని పెట్టుకోవటమే కాకుండా కీలక శాఖలన్నింటినీ బీజేపీ తన చేతిలోనే పెట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ముందైతే నితీష్ ప్రమాణం చేస్తే తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం.