కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ చెబుతున్న ఆర్థిక పాఠాలు వింటూ ఉంటే… నిజంగానే జనానికి మతి పోతున్నంత పని అవుతోంది. ఏదేనీ వస్తువు ధర తగ్గాలంటే.. దానిపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులో కోత విధించడమో, లేదంటే ఆ పన్నును పూర్తిగా ఎత్తివేయడమో చేస్తుంటారు. అయితే అలా పన్నులో కోత విధించడమో, లేదంటే ఏకంగా ఆ పన్నును ఎత్తివేయడమో చేస్తే… ఆయా వస్తువుల రేట్లు అమాంతంగా పెరిగిపోతాయంట. వినడానికి విడ్డూరంగా ఉన్నా… స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ఏమాత్రం మోహమాటం లేకుండానే చెప్పేశారు.
ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా చికిత్సల రేట్లను తగ్గించే క్రమంలో అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో పాటు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్సకు వినియోగించే ఔషథాల రేట్లు మరింత దిగివచ్చేలా ఆయా ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతులు, దేశీయంగా వాటి సరఫరాపై జీఎస్టీని మినహాయించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించేందుకు ట్వీట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన నిర్మలమ్మ… దీదీ కోరినట్లు జీఎస్టీ మినహాయిస్తే… కరోనా ఔషధాల రేట్లు అమాంతం పెరిగిపోతాయంటూ తనదైన శైలి వితండ వాదనను వినిపించారు. తన వాదనను బలపరచుకునే నిమిత్తం ఆమె ఓ కొతత్ ధియరీని కూడా వినిపించారు.
కోవిడ్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతులపైనా, దేశీయంగా సరఫరాపైనా జీఎస్టీ మినహాయింపునిస్తే అవి మరింత ఖరీదుగా మారతాయని నిర్మలమ్మ తెలిపారు. ‘ఒకవేళ జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపునిస్తే.. టీకాల తయారీ సంస్థలు తాము కట్టిన పన్నులను ఆఫ్సెట్ చేసుకునే అవకాశం లేక రేట్ల పెంపు ద్వారా ఆ భారాన్ని అంతిమంగా వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. కాబట్టి జీఎస్టీ మినహాయింపు వల్ల వినియోగదారుకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడమే కాకుండా ప్రతికూల ఫలితాలు ఇస్తుంది’ అని మంత్రి తనదైన శైలి వాదనను వినిపించారు. ఈ వాదనపై ఇప్పటికే జనం నుంచి సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి