తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా షర్మిల నేడు మరోసారి విమర్శలు గుప్పించారు. నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గం వనపర్తిలో పాదయాత్ర చేస్తున్న షర్మిల…అసలు ఎవడ్రా నువ్వు అంటూ నిరంజన్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పరాయి స్త్రీలు తల్లిని చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. తన సొంత ఇలాకాలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. షర్మిలపై నిరంజన్ రెడ్డి కూడా ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. అహంకారంతో వ్యక్తిగతంగా తనను దూషిస్తే ఊరుకోనని షర్మిలకు నిరంజన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనను ఒక్క మాట అంటే తాము వంద మాటలు అంటామని హెచ్చరించారు.
షర్మిల రాజన్న బిడ్డ అయితే మునుగోడులో పోటీ చేసి ఆమె సత్తా ఏంటో చూపించాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. వనపర్తిలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చిన ఘనత తనదని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన పిల్లలను విదేశాల్లో చదివించాలని నిరంజన్ రెడ్డి చెప్పారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన నేపథ్యం తనదని అన్నారు.
రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అంటూ వైఎస్ షర్మిలపై నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మరి, నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.