వివేకా మర్డర్ కేసు విచారణ వ్యవహారంలో జగన్ తీరుపై టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డే ప్రధాన పాత్ర పోషించాడని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొందని, దానిపై జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్యలో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల ప్రమేయం లేదని జగన్, సజ్జల చెప్పారని, మరి, సీబీఐ ఛార్జ్ షీట్ పై వారిద్దరూ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని మర్డర్ కేసు ముద్దాయిలను కాపాడడం రాష్ట్రానికే సిగ్గుచేటని, అసెంబ్లీ సాక్షిగా అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని నిమ్మల దుయ్యబట్టారు. వివేకాను అవినాశ్ ఎందుకు చంపుతాడంటూ అసెంబ్లీలో చిలుక పలుకులు పలికిన జగన్…నిందితులను కాపాడటానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్న సీబీఐ ఆరోపణలపై ఏమని స్పందిస్తారని నిలదీశారు.
హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్ర లేకుంటే సీబీఐ అధికారును బెదిరించి మరీ శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో కలిసి అరగంట సేపు ఏకాంతంగా ఎందుకు మాట్లాడాడని నిలదీశారు. ఈ కేసులో సాక్షులకు భద్రత కల్పించలేక పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. అప్రూవర్ దస్తగిరి కదలికలు శివశంకర్ రెడ్డి ఫోన్ లో ఎలా ఉన్నాయని నిలదీశారు. ఈ ఘటనలే జగన్, అవినాశ్ లు ఈ కేసును ప్రభావితం చేస్తున్నారనడానికి నిదర్శనమని అన్నారు.
హత్య రోజు ఘటనా స్థలానికి వెళ్లిన సీఐ శంకరయ్యను అక్కడ సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించాడన్న అభియోగాలతో సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. అయితే, అతడికి మరలా పోస్టింగ్ ఇచ్చి, ప్రమోషన్ తో సత్కరించారని నిమ్మల ఆరోపించారు. ఈ కేసులో నిందితులు కపిల్ సిబాల్ లాంటి నిష్ణాతులైన ఖరీదైన న్యాయవాదులను నియమించుకోగలరా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల అండ, ఆర్థిక బలంతోనే వివేకా కేసులోని ముద్దాయిలకు అత్యంత ఖరీదైన న్యాయసహాయం లభిస్తోందని ఆరోపించారు.