ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఎలాగైనా ఆపాలని విఫల ప్రయత్నం చేసిన జగన్ సర్కార్….సుప్రీం కోర్టు తీర్పుతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లింది. దీంతో, ఎన్నికల్లో గెలుపు కోసం సాధ్యమైనన్ని స్థానాలు ఏకగ్రీవం చేసే బలవంతపు కార్యక్రమాన్ని చేపట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫలితాలు హోల్డ్‌లో ఉంచాలని తెలిపారు.
ఈ రెండు జిల్లాల్లోనే భారీగా ఏకగ్రీవాలు జరగడంపై తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులపై నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. లొపాలుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ వార్నింగ్ ఇచ్చింది. మిగతా 11 జిల్లాలకు ఈ 2 జిల్లాలు విభిన్నంగా ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకుంది. అన్ని జిల్లాల్లో ఎన్నికల సంసిద్ధత పట్ల ఎస్ఈసీ సంతృప్తిని వ్యక్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని, వ్యాక్సినేషన్ ను పక్కనపెట్టి పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించడంపై అభినందనలు తెలిపింది. తాజా వ్యవహారంపై జగన్ సర్కార్ స్పందన ఏ విధంగా ఉంటుదన్నది ఆసక్తికరంగా మారింది.