ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. పార్టీ రహిత ఎన్నికలయినప్పటికీ…. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ పథకాలతో పరోక్ష ప్రచారాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. అయితే, మరోపక్క ఎన్నికల నిబంధనలకు అణుగుణంగా ఏఏ పథకాలకు బ్రేకులు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే రేషన్ డోర్ డెలివరీ వాహనంపై జగన్ ఫొటో, వైసీపీ రంగులు ఉండడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో, ఆ వాహనాలపై నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీ ఆపాలని నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రకారం పౌరసరఫరాల శాఖకు ఎస్ఈసీ లేఖ రాసింది. రేషన్ డెలివరీ వాహనాలపై వైసీపీ రంగులను తొలగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ రంగులన్నీ మార్చి మరోసారి వాహనాన్ని తీసుకొస్తే గ్రామాల్లో రేషన్ పంపిణీపై నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని ఎస్ఈసీ పేర్కొంది. ఇప్పుడు బోలెడు ఖర్చెపెట్టి వేసిన రంగులన్నీ తొలగిస్తే ప్రభుత్వానికి చాలా నష్టం.
దీంతో, ఎన్నికలలు ముగిసేవరకు ఆ వాహనాలను ఆపాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలకు డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి రేషన్ డోర్ డెలివరీ వాహనాలను తీసుకువచ్చారు. వాటిని నిమ్మగడ్డ పరిశీలించి…తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.