ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై వాడీ వేడి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. అయితే, ఏపీలో పదుల సంఖ్యలో కరోనా కేసులున్నపుడు ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ….ఇపుడు రోజుకు నాలుగువేల కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
పైగా, ఎన్నికల నిర్వహణ అంశంపై సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులను నిమ్మగడ్డ సంప్రదించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఎన్నికల నిర్వహణపై జరిగిన అఖిలపక్ష భేటీలో వైసీపీ నేతలు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల ఆరోపణలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పందించారు.
ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా.. ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదన్న వైసీపీ నేతల మాటల్లో వాస్తవం లేదని ఖండించారు. ఏపీలో కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో చర్చలు జరిపామని నిమ్మగడ్డ తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ రోజు జరిగిన భేటీలో ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలను నేరుగా హాజరై 11 పార్టీలు తెలియజేశాయని, 2 పార్టీలు లిఖితపూర్వక సమాధానాలు పంపాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఈ సమావేశానికి 6 రాజకీయ పార్టీలు హాజరుకాలేదని అన్నారు. ఎన్నికల నిర్వహణపై అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని, సీఈసీ అనుసరిస్తున్న విధానాలనే తాము కూడా అమలు చేసినట్లు స్పష్టంచేశారు.
ఈ రోజు జరిగిన సమావేశానికి టీడీపీ, బీజేపీ, సీపీఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ, జనతాదళ్, ముస్లిం లీగ్, సమాజ్ వాదీ పార్టీ, ఎఐడీఎంకే పార్టీల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. జనసేన పార్టీ ఈ మెయిల్ ద్వారా ఎస్ఈసీకి తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించింది. సమావేశానికి అధికార వైసీపీ, మరో 5 రాజకీయ పార్టీల నేతలు హాజరు కాలేదు.