ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై పడింది. అయతే, పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కొన్ని అవాంతరాలున్నాయని, ఆ అవరోధాలు తొలగిపోయిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
మార్చి 2నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని,ఒత్తిళ్ల వల్ల గతంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విజ్ణప్తులపై చర్చిస్తాం అని తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్స్ వేసి మరణించిన అభ్యర్థుల స్థానంలో నామినేషన్ వేసేందుకు మరో అవకాశం కల్పించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. బలవంతపు ఏకగ్రీవాలు, ఉపసంహరణలు, సింగిల్ నామినేషన్స్ పై నివేదికలివ్వాలని కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా నామినేషన్స్ స్వీకరణపై ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. నామినేషన్లు వేయలేకపోయినవారు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అందరి హక్కులను కాపాడే బాధ్యత ఎస్ఈసీపై ఉందని, ఈ నెల 23లోపు ఫిర్యాదుల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కచోట కూడా రీపోలింగ్ జరగలేదని, ఎన్నికలు వాయిదా పడలేదని అన్నారు. రాజకీయ వర్గాలు, ఓటర్లు విజ్ణతతో వ్యవహరించారని, మున్సిపల్ ఎన్నికలలోనూ అదే విధంగా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.