చెబితే నమ్మేలా ఉండాలయ్యా… హైదరాబాదులో టీ వెయ్యి రూపాయలేంది అంటారా? అంతేమరి ఒక్కోసారి. అయితే, ఇది వింతేమీ కాదు, హైదరాబాద్ స్పెషల్.
హైదరాబాద్ బిర్యానీకి ఇరానీ ఛాయ్ కి చాాలా ఫేమస్. ఇది అందరికీ తెలుసు. ముఖ్యంగా పాత బస్తీలో ఇరానీ చాయ్ స్పెషల్.
సాధారణంగా కప్పు టీ రూ.7 నుంచి రూ.20 వరకు ఉంటుంది. మనం మాట్లాడేది సాధారణ హోటల్స్ గురించి మాత్రమే.
కానీ అందరూ ఇరానీ ఛాయ్ బాగా ఇష్టపడే ప్లేస్ నిలోఫర్ కేఫ్.
లక్డీకాపూల్ సమీపంలో ఉంటుంది ఇది. అక్కడ సాధారణంగా ఇరానీ ఛాయ్ 15 రూపాయలే.
కానీ తాత్కాలికంగా ఒక స్పెషల్ ఇరానీ ఛాయ్ ని ప్రస్తుతం అక్కడ అందుబాటులో పెట్టారు.
అది ఒక కప్పు ఛాయ్ 1000 రూపాయలు.
దీనికి ఇంత రేటు పెట్టడానికి వాళ్ల ఇంటీరియరో, లగ్జరీనో కారణం కాదు, ఆ టీలో కలిపే టీపొడే స్పెషల్.
దీనికి ఒక పెద్ద కథే ఉంది.
ఈ వెయ్యి రూపాయల టీలో వాడే టీపొడి సాధారణమైనది కాదు. ఎక్కడపడితే అక్కడ దొరకదు. మీరు ఎంత డబ్బున్నా ఎపుడంటే అపుడు కొనలేరు.
ఎందుకంటే అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతం మైజాన్ టీ తోటల్లో మాత్రమే ఇది లభిస్తుంది. అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికుతుంది.
అది కూడా ఒకటి లేదు రెండుకిలోల పొడి మాత్రమే దొరుకుతుంది.
ఎందుకంటే ఇది మొగ్గల నుంచి తయారయ్యే పొడి. అవి ఏడాదికి ఒక్కసారి మాత్రమే మొగ్గల రూపంలో వస్తాయి. వాటిని సూర్యోదయానికి ముందే కోసుకోవాలి. తరువాత ఆరపెట్టి పొడి చేయాలి. ఇది కిలో లేదా కిలోన్నర మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ అరుదైన పొడికి భారీ డిమాండ్ ఏర్పడుతంది ప్రతి సంవత్సరం.
దీనిని ఊరికే అమ్మరు. వేలం వేస్తారు.
కోల్ కత్తాలో నిర్వహించిన వేలంలో నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు పాల్గొన్నారు. ఒక కిలో పొడిని రూ.75 వేలకు వేలం పాడి దక్కించుకున్నారు.
దాంతో తయారుచేసిన టీని రూ. 1000 కి అమ్ముతున్నారు. ఇది కూడా ఎక్కువ రోజులు అమ్మలేరు. వారంలో అయిపోతుంది ఇది.
అసలు ఈ స్పెషల్ చాయ్ లో పాలు కలపరు. ఆ పొడే అంత టేస్టు ఉంటుంది. డికాషన్ టీ అన్నమాట.
ఒక కప్పు టీలో 4 గ్రాములు మాత్రమే ఈ పొడిని వేస్తారు. మరి ఇంత చరిత్ర ఉన్న టీకి వెయ్యి రూపాయలు పెట్టడం కష్టమా?