చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న నిరసన కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు అరెస్టు వార్త విని ఆవేదనతో మరణించిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలని టీడీపీ కీలక నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుకు బదులు లోకేష్ జనంలోకి వెళ్లబోతున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ‘బాబుతో నేను’ కార్యక్రమం కొనసాగిస్తూనే ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.