ధైర్యం అన్నది డీఎన్ఏలో ఉండాలే కానీ.. నిజం చెప్పటానికి సంకోచించాల్సిన అవసరమే లేదు. తనను అదే పనిగా విమర్శిస్తూ.. తన అందం గురించి.. తన పర్సనాలిటీ గురించి కామెంట్లు చేసే వారికి దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ.
తనకు సినిమా అవకాశాలు రాకపోవటానికి కారణం.. తాను అందంగా లేకపోవటమే అంటూ.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై ఆమె ఫైర్ అయ్యారు. తనను కామెంట్లు చేసే వారు ఒక్కసారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ ముఖాలు చూస్తే అర్థమవుతుందని విరుచుకుపడ్డారు.
‘వాళ్ల పేరెంట్స్ పేర్లు పక్కన లేకపోతే రెండోసారి వారి ముఖాలు ఎవరూ చూడలేరు. స్టార్ స్టేటస్ ఉంది కాబట్టే..వాళ్ల సినిమాలు చేస్తున్నాం తప్పించి వాళ్లకంత సీన్ లేదు. నిజం చెప్పాలంటే నేను స్టార్ కిడ్స్ కంటే వంద శాతం బెటర్’ అంటూ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేసింది. స్టార్ కిడ్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా.. అంతకు మించి వివాదంగా మారాయి.
అయితే.. ఆమె తీరు బాగోలేదన్న మాట వినిపిస్తోంది. తనను ఎవరో ఏదో అంటే.. స్టార్ కిడ్స్ మీద పరుష వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. తాను అందంగా లేనని ఎవరో ఏదో అన్నారన్న దానికి ఇంతలా ఫీలై.. ఉతికి ఆరేసే వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్టార్ కిడ్స్ మీద అదే పనిగా పడిపోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తన మాటలతో ఆమె మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజా వ్యాఖ్యలతో మిత్రుల కంటే శత్రువుల్ని ఎక్కువగా తయారు చేసుకున్నట్లు అవుతోందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. నియా శర్మ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీయటం ఖాయమని చెప్పక తప్పదు.