కోడికత్తి కేసులో ఏపీ సీఎం జగన్ కు తాజాగా విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టు షాకిచ్చింది. తనపై జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని జగన్ తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేయడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఆగస్ట్ 1న విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది. ఇక, ఈ కేసులో నిందితుడిగా నాలుగేళ్లుగా జైలులో ఉన్న శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కూడా ఆగస్టు 1న విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది.
అయితే, శ్రీనివాస్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడని, విజయవాడ ఎన్ఐఏ కోర్టులో రెగ్యులర్ విచారణకు ఇబ్బందిగా ఉందని నిందితుడి తరఫు లాయర్ సలీం కోర్టు దృష్టికి తెచ్చారు. జైలులో రద్దీ ఎక్కువగా ఉందని, జైలు నుండి విచారణ సాధ్యం కాదని రాజమహేంద్రవరం జైలు అధికారి కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఈ కేసులో దాదాపు 4 సంవత్సరాలుగా శ్రీను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎన్ఐఏ కోర్టును కొంతకాలం క్రితం అభ్యర్థించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, శ్రీనివాస్ కు ఇచ్చిన బెయిల్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.
ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో మరోసారి బెయిల్ కోసం శ్రీను దరఖాస్తు చేసుకున్నాడు. అయితే,ఆ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. దీంతో, విచారణలో జాప్యానికి నిరసనగా జైల్లోనే నిరాహార దీక్ష చేసేందుకు శ్రీను కొద్ది రోజుల క్రితం సిద్ధమయ్యాడు. శ్రీనుకు న్యాయస్థానం రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని, లేదంటే శ్రీనివాస్ జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానని తనతో చెప్పినట్లు లాయర్ సలీం కూడా వివరించారు.