ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు వ్యాక్సిన్ కొరత, మరోవైపు ఆక్సిజన్, బెడ్ల కొరత…వెరసి రోజుకు వందమందికి పైగా చనిపోతున్న దయనీయ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. ఆక్సిజన్ కొరత లేదంటూ ప్రభుత్వం చెబుతోన్నప్పటికీ….తిరుపతి రుయా…అనంతపురం ఆసుపత్రి ఘటనలు ప్రభుత్వ ప్రకటనలు వాస్తవదూరమని నిరూపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి 11 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఘటనలో కనీసం 50 మంది చనిపోయారని, కానీ, ప్రభుత్వం మాత్రం 11 మందినే చూపించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ ఘటనలో 30 మంది చనిపోయారని జాతీయ మానవహక్కుల సంఘానికి(ఎన్. హెచ్.ఆర్.సి) తిరుపతి మాజీ ఎంపీ సీ.హెచ్ మోహన్ ఫిర్యాదు చేశారు.
మరోవైపు, ఈ ఘటనలో 11 మంది చనిపోవడంపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లిబర్టిస్ సోషల్ జస్టిస్ సంస్థ ప్రతినిధి జెష్టాది సుధాకర్ కూడా ఎన్. హెచ్.ఆర్.సికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదులపై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి…ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుల్లోని అంశాలపై 4 వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫిర్యాదులలోని విషయాలు వాస్తవాలైతే అది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్. హెచ్.ఆర్.సి పేర్కొంది.
అంతకుముందు, రుయాలో మరణాలపై హైకోర్టులో జీబీపీ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిగింది. ఈ ఘటనలో 50 మంది మృతి చెందితే కేవలం 11 మందే మరణించారని ప్రభుత్వం పేర్కొనడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి మరణాల సంఖ్యను గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని జగన్ సర్కార్ ను న్యాయస్థానం ఆదేశించింది. వేసవి సెలవు అనంతరం ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగనుంది.