నిత్యం లక్షలాది కేసులు నమోదు అవుతున్నప్పటికీ.. నిబంధనల్ని పెద్దగా పట్టించుకోకుండా.. తమ వ్యక్తిగత ప్రాధాన్యతలకు మాత్రమే పెద్ద పీట వేయటం మనకు అలవాటే. అందుకు భిన్నంగా కరోనా వేళ.. తనకు తన వ్యక్తిగత జీవితానికి మించి.. దేశానికి మేలు జరగటం చాలా అవసరమన్న కమిట్ మెంట్ తో … తన పెళ్లిని వాయిదా వేసుకున్న ప్రధానమంత్రిగా న్యూజిలాండ్ పీఎం జసిండా ఆర్డెన్ నిలుస్తారు. తాజాగా కోవిడ్ కేసులు ఆ దేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆమె తాజాగా జరగాల్సిన తన పెళ్లిని రద్దు చేసుకున్న విషయాన్ని వెల్లడించారు.
టీవీ వ్యాఖ్యాతగా సుపరిచితుడైన క్లార్క్ గే ఫోర్డుతో న్యూజిలాండ్ ప్రధాని జసిండా వివాహం చేసుకోవాల్సి ఉంది. పెళ్లికి ముందే కలిసి ఉంటున్న ఈ జంట పెళ్లి చేసుకోవాల్సి ఉంది. తాజాగా కేసులు అంతకంతకూ పెరిగిపోవటంతో ఆమె తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా ప్రకటించారు. కరోనా మొదటి వేవ్ వేళ.. తమ దేశ సరిహద్దుల్ని మూసేయడం ద్వారా కరోనా ఫ్రీ దేశంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టారు.
ఎప్పుడైతే డెల్టా వేరియంట్ మొదలైందో.. న్యూజిలాండ్ లో కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆ దేశంలో 15 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 52 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ఈ పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా దేశంలోని వేలాది మంది ప్రజలు కష్టాలు పడుతున్నారని.. అలాంటి వేళ. .వారి కంటే తానేమీ ప్రత్యేకం కాదన్నారు. మనం బాగా ప్రేమించే వారు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు వేడుక చేసుకోలేం కదా? అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆ దేశంలో తొమ్మిది ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో.. ఆ దేశంలో కొత్త ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే గరిష్ఠంగా వంద మంది మాత్రమే.. అది కూడా వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటే.. పాతిక మందికి మించి పాల్గొనకూడదు. జిమ్ లకు.. పెళ్లిళ్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. స్కూలుకు వెళ్లే విద్యార్థులు ముఖానికి మాస్కులు పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం ఆ దేశంలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 94 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకుంటే.. 54 శాతం మంది బూస్టర్ డోసు కూడా వేసుకోవటం గమనార్హం.