క్యాలెండర్ లోని 365 రోజుల్లో ఏ రోజుకు లేని ప్రత్యేకత ఉన్న రోజు అంటే జనవరి 1 అని చాలామంది చెబుతారు. కానీ.. జనవరి 1 కంటే కూడా డిసెంబరు 31 ఉండే ఉత్సాహం.. ఆ రాత్రి వేళ చేసుసుకునే పార్టీల్లో జోష్ అంతా ఇంతా కాదు. ఆ మాటలకు వస్తే 31 రాత్రి వేడుకల పేరుతో రాత్రి ఏ రెండు గంటలకో నిద్రపోవటం.. ఏడాది మొదటి రోజునే ఆలస్యంగా నిద్ర లేవటం చూస్తుంటారు.
ఇలా చూసినప్పుడు జనవరి 1 కంటే కూడా డిసెంబరు 31 రాత్రి పార్టీ కోసం ఎంతగానో ఎదురుచూసేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. మరో రెండు రోజుల్లో రానున్న డిసెంబరు 31 కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఓవైపు కొవిడ్ కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా డిసెంబరు 31 రాత్రి వేళలో మద్యం దుకాణాలతో పాటు.. పబ్ లు.. రెస్టారెంట్లు.. క్లబ్బుల్లో న్యూఇయర్ వేడుకల్ని నిర్వహించుకోవటానికి వీలుగా మద్యం సరఫరాను అర్థరాత్రి 12 గంటల వరకు ఉండేలా అధికార ఉత్తర్వులు జారీ చేయటంతో.. పార్టీ రాయుళ్లలో సంతోషం పొంగి పొర్లింది.
అయితే.. దీనిపై న్యాయవాది ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేసే వేడుకల్ని నియంత్రించాల్సి ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న వాదనను వినిపిస్తూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టును ఆశ్రయించారు. క్రిస్మస్.. న్యూఇయర్.. సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. గురువారం ఈ అంశంపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. న్యూయర్ ఇయర్ వేడుకల్లో అనుసరించాల్సిన విధి విధానాలు.. ఆంక్షల్ని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇందులో.. పార్టీకి హాజరయ్యే వారు తప్పనిసరిగా అనుసరించాల్సిన విధివిధానాల్ని స్పష్టం చేశారు. తాము జారీ చేసిన మార్గదర్శకాల్ని తప్పనిససరిగా పాటించాలని ఆదేశించారు. పబ్ లు.. హోటల్లు.. క్లబ్ లకు విధించిన నియమాల్ని చూస్తే..
– రెండు డోసుల టీకాల్ని తీసుకున్న వారికి మాత్రమే అనుమతించాలి
– వేడుకల్లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి
– వేడుకల్లో మాస్కు లేకపోతే రూ.వెయ్యి జరిమానా
– వేడుకలకు రెండు రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
– హోటళ్లు.. పబ్ ల్లో పాల్గొనే సిబ్బందికి 48 గంటల ముందు కొవిడ్ పరీక్షలు చేయాలి
– బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు
– సౌండ్ పొల్యూషన్ కు కారణమైన వారిపై చర్యలు
– మద్యం సేవించి వాహనాన్ని నడిపిన వారిపై కేసులు నమోదు
– డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారికి ఆర్నెల్లు జైలు.. రూ.10వేలు ఫైన్
– అసభ్యకర దుస్తులు ధరించినా.. డ్యాన్సులు చేసిన చర్యలే
– వేడుకల్లో మాదక ద్రవ్యాల్ని అనుమతిస్తే చర్యలు
– పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలునిర్వహణ