సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం కొద్ది నెలలుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీకి చెందిన ఓ ఎంపీ అరెస్టుకు రంగం కూడా సిద్ధమవుతోందని పుకార్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో మరో ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై వివేకా పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
లాయర్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా ఆయన కోర్టులో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వివేకా మర్డర్ కేసులో ఇతరుల పేర్లు చెప్పాలంటూ తనపై లోకేశ్వర్ ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ విషయంలో జిల్లా ఎస్పీకి, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించానని చెప్పడం షాకింగ్ గా మారింది. సీబీఐకి మద్దతుగా ఇతరుల పేర్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు ఒత్తిడి తెస్తున్నారని కోర్టుకు తెలపడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, ఈ కేసు విచారణపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని వర్ల రామయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో జైళ్ల శాఖ ఉంటుందని, ప్రభుత్వం తలుచుకుంటే జైల్లో ఉన్న ముద్దాయిలను కావాల్సినప్పుడు బయటకు తీసుకురావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ముద్దాయిలు ఆసుపత్రిలో ఏసీ రూంలో ఉండొచ్చని, వారు సకల సుఖాలు అనుభవించే వీలుంటుందని… తస్మాత్ జాగ్రత్త సీబీఐ అని వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.